వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్:
వినియోగదారులు లేకుండా వ్యాపార రంగాల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే ఎల్లప్పుడూ నాణ్యతా ప్రమాణాలకు లోబడి, వారికి ఉత్తమ వస్తుసేవలను అందించాలని బిఐఎస్ పూర్వ అధ్యక్షులు ఎ.పి. శాస్త్రి అన్నారు. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సిటీ కాలేజి స్టాండర్డ్ క్లబ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సంయుక్తంగా సదస్సు సోమవారం నిర్వహించాయి.

ఈ సదస్సులో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్నాలజీ సేవలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో 2024 వ సంవత్సరానికి ‘వినియోగదారుల కోసం న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్’ అనే నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని తెలిపారు.

విద్యార్థులు ఈ విషయమై విషయ పరిజ్ఞానం పెంచుకోవటమే కాక తమ ఇంట్లోని వారికి, తెలిసిన వారికి అవగాహన కలిగించాలని సూచించారు. వినియోగదారులుగా తమ హక్కులకు భంగం వాటిల్లినా, మార్కెట్ దుర్వినియోగాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పేర్కొన్నారు.

స్టాండర్డ్ క్లబ్ మెంటర్ డా.వై.వాసుదేవ రెడ్డి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగం అధ్యక్షులు డా.రత్న ప్రభాకర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి అందరికీ అవగాహన ఉండాలని, వాటికి భంగం కలిగితే వినియోదారుల ఫోరంలో న్యాయం పొందొచ్చని వెల్లడించారు. సదస్సు అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలిచిన పూజ మీనా, కావ్య, జగదీష్, నాగు, ఉదయ్ కిరణ్, మురళీ కృష్ణ తదితర విద్యార్ధులకు రూ.15,000 నగదు బహుమతులను అందజేశారు.