వేద న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని చెప్పారు. గత శాసన సభ సమావేశాల్లో కుల గణన సర్వే కు తీర్మానం చేశామని, ఆ ప్రాసెస్ నడుస్తోందని వివరించారు.
వృత్తి పర కులాల కు సంబంధించి కుల వృత్తులకు సాంకేతికతను జోడించి మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. మంగళవారం కేబినెట్ లో కుల వృత్తులు చేసుకునే వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ముదిరాజ్ కార్పోరేషన్ , యాదవ కుర్మ కార్పోరేషన్, మున్నూరు కాపు కార్పోరేషన్, పద్మశాలి కార్పోరేషన్, పెరిక కార్పోరేషన్, లింగాయత్ కార్పోరేషన్, మేర కార్పోరేషన్, గంగపుత్ర కార్పోరేషన్ , రెడ్డిలకు రెడ్డి కార్పోరేషన్ తో పాటు ఈబీసీ లకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మాదిగ, మాదిగ ఉప కుల వృత్తులకు కార్పొరేషన్ , మాల మాల ఉప కుల వృత్తులు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సంత్ సేవలల్ లంబాడా కార్పోరేషన్ , ఆదివాసీ గిరిజన కార్పోరేషన్ ఏకలవ్య , ఉప కులాల కార్పోరేషన్ ఏర్పాటు కు కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లు ఇచ్చి 1,000 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బలహీన వర్గాలకు ప్రత్యేక కార్పోరేషన్ చేసి వారిని బలోపేతం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని ప్రతి పాదన వచ్చిందని, ఈ విషయమై ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని తెలిపారు. కుల వృత్తులకు ఆర్థికంగా ఉపాధి కల్పించి బలోపేతం చేయడంలో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.