వేద న్యూస్, వరంగల్ :
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు వ్రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి నేడోక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నామని, జిల్లాలో 9455 మంది పరీక్షలు వ్రాస్తున్నారనీ, వారి కోసం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణలో 54 మంది చీఫ్ సూపరింటెండెంట్, 54 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మరియు ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో పాల్గొంటారని, విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన డ్యూయల్ డెస్క్ లను అందుబాటులో ఉంచామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవకతవకలు జరగకుండా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు విద్యార్థులు,పరీక్ష డ్యూటీలలో పాల్గొనే సిబ్బంది మొబైల్ ఫోన్లు , ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను తీసుకురావడానికి నిషేధించామని, పరీక్ష కేంద్రాల్లోకి ఇతరులు రాకుండా విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఫోటో గుర్తింపు కార్డులు అందించామని , వాటిని తప్పనిసరిగా ధరించాలని అన్నారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని,ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు,సైన్స్ పరీక్ష మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-50 గంటల వరకు జరుగుతుందని, సైన్స్ పరీక్ష ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడుపుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాల్ టికెట్స్, పరీక్ష ప్యాడ్, పెన్, పెన్సిల్ , స్కేల్, షార్పనర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకొని రావాలని అన్నారు. పరీక్ష రాయడానికి ముందు ఓఎంఆర్ షీట్ లోని వివరాలను, పరీక్షా రాసే విద్యార్థినీ, విద్యార్థులు ఇన్విజిలేటర్ ధృవీకరించాలని, ప్రశ్నపత్రం జారీ అయిన వెంటనే, విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ను జారీచేయబడిన పశ్నా పత్రముపై విధిగా వ్రాయాలని, అభ్యర్థులు తప్పనిసరిగా ఓఎంఆర్ షీట్ లో మెయిన్ అన్సర్ షీట్ సీరియల్ నెంబర్ ను సంబంధిత గడిలో విధిగా వ్రాయాలని అన్నారు. ప్రధాన జవాబు పత్రంతో అదనపు సమాధాన పత్రం పార్ట్-బి, గ్రాప్, మ్యాప్‌లను జత చెయాలని, దారంతో గట్టిగా కట్టాలని, పరీక్ష డ్యూటీలో ఉన్న సిబ్బంది, విద్యార్థులు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం వదిలి వెళ్లడానికి అనుమతించబడరని, పరీక్ష సమయంలో, ఒక అభ్యర్థి కాపీయింగ్, మాస్ కాపియింగ్ చేస్తే నిబంధనల ప్రకారం ప్రకారం డిబార్ చేసి తదుపరి పరీక్షలకు అనుమతించబడరని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.