వేద న్యూస్, వరంగల్ :
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. సోమవారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని, డిఇఓ, చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ప్రహారి గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.కలెక్టర్ వెంట డీఈ ఓ వాసంతి, చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.