- పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
- పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి
- కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హుజరాబాద్ లో 10వ తరగతి పరీక్ష కేంద్రంను మంగళవారం తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తూ మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు.
ఎంతమంది పరీక్ష రాస్తున్నారు.. ఎందరు హాజరయ్యారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరీక్షల చీఫ్ సూపరిండెంట్ ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండాకాలం నేపథ్యంలో పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులకు నీరసం నుంచి ఉపశమనం కలుగుతుందని, బలం చేకూరుతుందని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు.
పరీక్ష జరిగే సమయంలో అధికారు లు అంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్టీవో రమేష్ బాబు, తహసిల్దార్ విజయ్ కుమార్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్ శోభారాణి, డిఓ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.