వేద న్యూస్, డెస్క్ :
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన భరోసా నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి విలేకరికి అక్రెడిటేషన్ కార్డుతోపాటు హెల్త్ కార్డు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్‌కార్డు, డైరీ, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి దానిని నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్ సర్కార్ పై నమ్మకం ఉందని, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇల్లు అందించేందుకు తన వంతు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణలో మొత్తం 23 వేల మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రతి సంస్థలో ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేక అక్రిడేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. అర్హులైన విలేఖరులకు తప్పకుండా అక్రిడేషన్ ఇస్తామని తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా అందరూ ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు.
జర్నలిస్ట్ విలువలను కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. మన వృత్తి విలువ, జర్నలిజం ప్రమాణాలు, నైతిక విలువలను పెంచుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. జూన్ 6 తర్వాత అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందజేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
ప్రభుత్వాల నుంచి కూడా ఉచితంగా ఏమీ ఆశించవద్దు. మార్కెట్ రేటు కాకుండా మాకు ఒక రేటుకు భూమి లేదా ఫ్లాట్‌లు ఇస్తే ఇళ్లు కట్టుకుందాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టీఎఫ్‌జే అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జే.రాంబాబు, కోశాధికారి సురేంద్రనాయుడు, అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.