వేద న్యూస్, కేయూ:
‘మీరిచ్చిన మాటకై..మీరిచ్చిన మాటలోనే’ అనే నినాదంతో కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కాంట్రాక్ట్ అనే పదం ఉండదని చెప్పారని కాంట్రాక్ట్ అధ్యాపకులు గుర్తు చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు గత 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ముందర దాదాపు 150 రోజులు వివిధ రూపాల్లో, వివిధ దశల్లో ఉద్యమం చేసిన అధ్యాపకులు..త్వరలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున తమను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేయాలి: కె.మధూకర్ రావు
కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ కె.మధూకర్ రావు నిరవధిక సమ్మె గురించి ‘వేద న్యూస్’తో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో 1,445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి. మేము రెగ్యులరైజేషన్ కోసం వివిధ రూపాల్లో వివిధ దశల్లో ఉద్యమించాం. ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే నిరవధిక సమ్మెకు దిగాం. యూనివర్సిటీలో పని చేసే కాంట్రాక్ట్ అధ్యాపకులు అలానే ఉండిపోతున్నారు. అప్పట్లో వరంగల్‌కు వచ్చిన క్రమంలో కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. కానీ, ఆ విషయమై ఆచరణలో కృషి చేయడం లేదు. యూనివర్సిటీలో ఉన్నత చదువులు(డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ) చదివిన తమను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదో తెలియడం లేదు. జేఎల్, డీఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేసిన మాదిరిగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అన్ని అర్హతలున్నా తమను ఎందుకు పర్మినెంట్ చేయరని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. యూనివర్సిటీలో పర్మినెంట్ లెక్చరర్స్ 76 మంది ఉండగా, 186 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. మాకు మినిమమ్ టైమ్ స్కేల్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలె.
కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: తూర్పాటి వెంకటేశ్, యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్
రెగ్యులరైజేషన్ కోసం గత 150 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం. గత 10 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాం. ఎలాంటి సిగ్నేచర్ చేయకుండా, పాఠాలు బోధించకుండా కేవలం టెంట్‌లో వచ్చి కూర్చుంటున్నాం. ప్రభుత్వానికి మాపై ఎందుకు చిన్నచూపో అర్థం కావడం లేదు. డీఎల్, పీఎల్ లాంటి వారిని రెగ్యులరైజ్ చేయడంలో అడ్డు రాని రూల్స్ మాకు ఎందుకు అడ్డు వస్తున్నాయో తెలియడం లేదు. ఈ విషయమై మేము వివిధ ప్రజాప్రతినిధులను కలవగా, అండర్ ప్రాసెస్ అని 4 నెలలుగా చెప్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో మా గురించి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా విషయం ప్రస్తావించారు. కానీ, రెగ్యులరైజ్ విషయమై అడుగులు పడటం లేదు. మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే..మాకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌పై మాకు సమగ్ర అవగాహన ఉంది. ప్రజానీకానికి కేసీఆర్ సర్కార్ పై పాజిటివ్స్ మేము వివరించగలం. అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక్క కార్యక్రమం చేయలేదు. కానీ, భవిష్యత్తులో వ్యతిరేకంగా చేసే అవకాశం వచ్చేలా ఉంది. ఇంకా 4 లేదా 5 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాదిరిగా పని చేస్తున్నప్పటికీ మమ్మల్ని ఎందుకు పర్మినెంట్ చేయడం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా మేము సంకుచిత భావనకు, మానసిక క్షోభకు గురవుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సూత్రాన్ని పాటించాలని కోరుతున్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నా. ప్రభుత్వం మమ్ములను రెగ్యులరైజ్ చేయని యెడల మా వద్ద కూడా అస్త్త్రాలు ఉన్నాయి.
మా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది: డాక్టర్ వీణ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లిష్, కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ
కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలనే డిమాండ్ తో గత 150 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉద్యమిస్తున్నాం. మాకు అన్ని అర్హతలున్నప్పటికీ మాపైన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉన్నది. అయినా ఇప్పటికీ మేము ప్రభుత్వంపైన హోప్‌తోనే ఉన్నాం. తెలంగాణ వస్తే ‘కాంట్రాక్ట్’ అనే పదం ఉండదని కేసీఆర్ 2014లో చెప్పారు. ఆ మాటపైన నమ్మకంతో వెయిట్ చేస్తున్నాం. త్వరలో ఎన్నికల కోడ్ వస్తోందని వినికిడి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాకు అన్ని అర్హతలు మాకున్నాయి. మాకు 25 సంవత్సరాల ఎక్స్‌పీరియెన్స్ ఉంది. పీహెచ్డీ క్వాలిఫికేషన్ తో పాటు మేము నెట్, స్లెట్ క్వాలిఫై అయి ఉన్నాం. పిల్లలకు నీతి పాఠాలు చెప్పే మేము ఇలా రోడ్డుమీదకు రావడం దయనీయం. 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ను ఈ సందర్భంగా కోరుతున్నా.