• అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన ప్రభుకు గురువుల అభినందన
  • జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ విజేతగా నిలిచినందుకు సంతోషం

వేద న్యూస్, జమ్మికుంట:

గత నెల 8 నుండి 11 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ లలో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) పాల్గొని హైమన్ త్రోలో తన ప్రతిభను కనబరిచారు. ఆ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం కరీంనగర్ అలుగునూరు‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ (సీవోఈ) ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వీరేశం ఆత్మీయంగా ఆహ్వానించి చిన్ననాటి శిష్యుడు ప్రభాకర్ (ప్రభు) మెడలో మెడల్స్‌ను వేసి ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్
దేవేందర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వీరేశం మాట్లాడుతూ ప్రభాకర్ ఐదో తరగతి నుండి మేడిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదివారని గుర్తుచేశారు. నాటి నుండి నేటి వరకు చదువుతో పాటు క్రీడలు, కళల రంగాలలో తనదైన ప్రతిభను కనబరుస్తూ క్రమశిక్షణతో ఈ సమాజానికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమని చెప్పారు.

ప్రభును చూసి గురుకుల గురువుగా గర్వపడుతున్నామని వెల్లడించారు.
ప్రభాకర్ చేస్తున్న మంచి పనులను యువకులతో పాటు ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని పుట్టిన ఊరికి ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. తైవాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని విజయం సాధించాలని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.