వేద న్యూస్, హైదరాబాద్ : 

వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనా ఫలాలు  సగటు మనిషికి  ప్రయోజనాన్ని చేకూర్చాలని  ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ అన్నారు.  కౌన్సిల్ ఆఫ్  సైంటిఫిక్ అండ్  ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ   సౌజన్యంతో ప్రభుత్వ సిటీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం  ఆధ్వర్యంలో  అడ్వాన్సేస్ ఇన్ ఎనర్జీ మెటీరియల్స్అండ్ డివైజెస్ అనే అంశం పై జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఆచార్య రవీందర్ మాట్లాడారు. సామాజిక  తత్త్వానికి   వైజ్ఞానిక శాస్త్రాల పరిశోధనలకు మధ్య  అంతర్గత సంబంధం ఉండాలని సూచించారు. సరికొత్త  ఆలోచనలతో, వినూత్న  పరిశోధన ఆసక్తితో  ముందుకువచ్చే విద్యార్థులకు విశ్వ విద్యాలయం పక్షాన  ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక మార్కుల సాధన కోసం కాకుండా  నైపుణ్యాలను  సముపార్జించు కోవడం పైనే విద్యార్థులు  ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని  ఆయన అన్నారు. డిగ్రీలో  సైన్స్ చదువుకున్న విద్యార్థులు తమకిష్టమైన మరొక  కోర్సులో పిజి చేసే అవకాశం కేవలం ఉస్మానియా విద్యాలయంలో మాత్రమే ఉందని ,విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య రవీందర్ అన్నారు.  ప్రయోజనవంతమైన జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం లో సిటీ కళాశాల అగ్రభాగాన నిలిచిందని ఆచార్య రవీందర్  కితాబు ఇచ్చారు. ఇందుకు కారణమైన ప్రిన్సిపాల్ డా.బాల భాస్కర్ ను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గౌరవ అతిథిగా  పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్స్ విభాగం  డీన్ ఆచార్య డి.కరుణా సాగర్ మాట్లాడుతూ  పర్యావరణహితమైన  వైజ్ఞానిక ఆవిష్కరణలను, శక్తి సంబంధమైన సాధనాలను కొత్తగా రూపొందించుకోవాల్సిన అవసరముందని అన్నారు.   కాలానుగుణమైన ఎనర్జీ టెక్నాలజీని విస్తృత పరుచుకోవాలి అన్నారు. ఆత్మీయ అతిథి గా పాల్గొన్నఏ.ఆర్.సి.ఐ  అసోసియేట్ డైరక్టర్  డా.పి. కె. జైన్ మాట్లాడుతూ బహుళ ప్రయోజనదాయకమైన వైజ్ఞానిక సాధనాలను,  శక్తి సంబంధమైన పరికరాలను తయారు చేసుకోవాలని అన్నారు.  పాఠ్యాంశాల ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని సామాజిక వికాసానికి ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు శిక్షణ నివ్వాలని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ మాట్లాడుతూ  ప్రస్తుతం సమాజం ఎదుర్కొనే సవాళ్ళను  అధిగమించటానికి అవసరమైన పరిశోధనలపై  శాస్త్రవేత్తలు, ఆచార్యులు దృష్టి పెట్టాలని అన్నారు.  ఐఐసిటి సంస్థ శాస్త్రవేత్త  ఆచార్య యం. వసుంధర , ఉస్మానియా విశ్వ విద్యాలయం భౌతికశాస్త్ర విభాగం అధ్యక్షులు ఆచార్య యం శ్రీనివాస్ లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సదస్సు సమన్వయ కర్త  డాక్టర్ కె .పర్వతాలు ఈ జాతీయ సదస్సు లక్ష్యాలను వివరించారు. భౌతిక శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. నైన వినోదిని, సదస్సు సహాయ సమన్వయ కర్త డా.వాసుదేవరెడ్డి,  డా. చిన్ని కృష్ణ, డా. లక్ష్మీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ దత్ శుక్ల ,  డా. యాదయ్య, డా.రత్నప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.తదనంతరం ప్రచురించిన ప్రత్యేక సంచికను వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్  బాలభాస్కర్  అతిథులను సన్మానించారు. రెండు రోజుల జాతీయ సదస్సులో  వివిధ విశ్వ విద్యాలయాల, కళాశాలల ఆచార్యులు పత్ర సమర్పణ చేస్తారు. వివిధ  దేశాల నుండి  అనేక మంది శాస్త్ర వేత్తలు అంతర్జాలం ద్వారా ప్రసంగించనున్నారు.