వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డీఎంహెచ్ఓ) లకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్లగా థైరాయిడ్, ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇచ్చారు. ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని ఆస్పత్రి సిబ్బంది తొలుత తెలిపారు.
ఈ నెల 6న రక్త నమూనాలు తీసుకున్నారు. వారం తరువాత హాస్పటల్ కు వెళ్లి వైద్య సిబ్బందిని రిపోర్ట్స్ అడగగా ఇంకా రాలేదని నిర్లక్ష్య సమాధానం చెప్పారు. తర్వాత రోజు వెళ్లి అడగగా ఇంకా రిపోర్ట్స్ రాలేదని తెలిపారు. ప్రతి రోజూ అదే విధంగా సమాధానాలు వస్తుండటంతో పేషెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 24న ఆస్పత్రి సిబ్బందిని రిపోర్ట్స్ గురించి ఎందుకు ఇలా తిప్పించుకుంటున్నారని అడగగా..మీ రక్త నమూనాలు(శాంపిల్) మిస్ అయ్యాయని, మళ్లీ రక్త నమూనాలు ఇవ్వాలని , అప్పుడు టెస్టులకు పంపిస్తామని నిర్లక్యంగా వ్యవహరించారు. తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పేద ప్రజలను టెస్టుల పేరుతో దోచుకుంటున్న మమత హాస్పటల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం ఈ విషయమై జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కి బాధితుడు రవికృష్ణ ఫిర్యాదు చేశారు.