- టెస్టుల పేరుతో డబ్బులు దోపిడీ
- శాంపిల్ ఇచ్చి రోజులు గడుస్తున్న రిపోర్ట్ ఇవ్వట్లే
- అదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్న వైనం
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏ మాత్రం ఖాతరు చేయట్లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు ఆస్పత్రుల్లో ఉండాలి., అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫైర్ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ వారు సూచించిన విధంగా ఉండాలి. ఆయా పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ.. చాలా ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదని చెప్పుకోవచ్చు. అంతేగాక అర్హత లేకున్నా కొన్ని ల్యాబ్‌లలో టెస్టులు చేయిస్తున్నారు.
జమ్మికుంట పట్టణ, గ్రామీణ ప్రాంత నిరుపేద రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే జంకుతున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి టెస్టుల పేరుతో వేలకు వేల రూపాయలు దోచుకుంటున్నదని బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాల మీద ఆశతో ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు ఉంటాయో? లేవో ? అనే అనుమానంతో ప్రాణం కంటే ఏమి ఎక్కువ అని అప్పు చేసిమరీ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే నిరుపేద రోగులను టెస్టుల కోసం తమ రక్తాన్ని శాంపిల్స్ తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించి..శాంపిల్స్ మిస్ అయ్యాయని చెబుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ థైరాయిడ్ టెస్ట్ కోసం రక్త నమూనా ఇవ్వగా, 20 రోజులు మండుటెండలో ఆస్పత్రి చుట్టూ తిప్పుకొని, చావు కబురు చల్లగా చెప్పినట్టు ‘శాంపిల్ పోయింది.. మళ్లీ రక్తం ఇవ్వండి’ అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని బాధితులు ఆరోపించారు. సదరు రోగి రిపోర్టు అందకపోవడంతో సరైన చికిత్స అందక మరింత అనారోగ్యానికి గురైనట్టు అవేదన వ్యక్తం చేశారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్న సదరు ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.