- ఎవరైనా సరే నన్ను సంప్రదించాల్సిందే!
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్..!?
వేద న్యూస్, వరంగల్:
పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతో పాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని అరోపణలు లేకపోలేదు. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం ఆన్లైన్లో సర్వే నంబర్ల పరిశీలన, డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనుల గురించి తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తున్నారు. దాంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా కోనసాగుతోంది.
అయితే డాక్యుమెంట్ రైటర్లలో ఓ డాక్యుమెంట్ రైటర్ మాత్రం నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును తన సొంత కార్యాలయంగా మలుచుకున్నాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాను చెబితే తప్ప ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కావు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తనకి ఓ మాజీ ఎమ్మెల్సీ అండదండలు నిండుగా ఉన్నాయని తనని ఎవరు ఏమి చేయలేరని అంటున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా సామాన్య ప్రజల నుండి ఇష్టం వచ్చినంత డబ్బులు వసూలు చేస్తూ సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న రైటర్‌పై పోలీసులు దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.