•  తారస్థాయికి ప్రచారపర్వం
  •  ముక్కోణపు పోటీలో నెగ్గేదెవరో?
  •  కరీంనగర్‌లో కమలానికి పోటీగా హస్తం
  •  గెలుపు గ్యారెంటీ ఎవరికి దక్కెనో?

వేద న్యూస్, కరీంనగర్:
పార్లమెంటు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ స్థానాన్ని దక్కించేందుకునేందుకు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ముందుకు సాగుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందరే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రచారం షురూ చేశారు.

కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కమలం పార్టీదే హవా ఉందని రాజకీయ పరిశీలకులు కొందరు విశ్లేషిస్తున్నారు. వాతావరణం బీజేపీకే అనుకూలంగా ఉందని అంచనా వేశారు. కాగా తాజాగా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఈ సారి ముక్కోణపు పోటీ తీవ్రంగానే ఉంటుందని స్పష్టమవుతోంది. బీజేపీకి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎడ్జ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం బాగానే పుంజుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రచారపర్వంలో హస్తం పార్టీ కమలాన్ని దాటేసి ముందుకెళ్తుందని సమాచారం. ఇవే పరిస్థితులు ఎలక్షన్ డే నాటికి కొనసాగితే..హస్తం పార్టీ విజయాన్ని ముద్దాడే అవకాశాలు మెండగానే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్నీ తానై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం..
కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వెలిచాల రాజేందర్ రావును ఆ పార్టీ హై కమాండ్ ఆలస్యంగా ప్రకటించింది. అయినప్పటికీ ప్రచారంలో ముందుకెళ్లేందుకు వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు నిలుస్తున్నారు. దీనికి తోడు వెలిచాల సొంత మేనిఫెస్టోనూ గ్యారెంటీగా ప్రకటించారు.

పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అయినప్పటికీ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నీ తానై ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. అఫీషియల్ క్యాండిడేట్ వెలిచాల రాజేందర్ రావు అయినా మంత్రి పొన్నం ప్రభాకరే క్యాండిడేటా అనే రీతిన ప్రచారం చేస్తుండటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున జరుగుతున్నాయి. మంత్రి ప్రభాకర్ పొన్నం నాయకత్వంలో పార్టీలో నయా జోష్ కనబడుతోంది. ఈ అంశాలన్నీ కూడా పార్లమెంటు అభ్యర్థి గెలుపునకు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు.

వెరీ టఫ్ ఫైట్
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వెరీ టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికైతే హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు సానుకూలంగా ఉండగా, చొప్పదండి, కరీంనగర్‌, వేములవాడలో బీజేపీ వేవ్ ఉందని, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని సమాచారం. ఇటీవల జమ్మికుంట జనజాతర సభతో కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రచారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో జోరుగా సాగుతోంది. ఇదే ప్రచార జోరు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శ్రేణులు కొనసాగిస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఓటు బ్యాంకును పదిలపరుచుకుని పోటీలో ముందంజలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వేములవాడలో త్వరలో ప్రధాని నరేంద్రమోడీ సభ జరగనుంది. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లే కరీంనగర్ పార్లమెంటు సభ్యుడి గెలుపు, ఓటమిలో కీలక పాత్ర పోషిస్తారనే చర్చ కూడా సాగుతోంది. వారే అభ్యర్థి గెలుపోటమి డిసైడ్ చేస్తారని స్పష్టమవుతోంది. చూడాలి మరి..కరీంనగర్ పార్లమెంటును చివరికి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో..