• మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో..
  •  సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి
  •  అనుచరులు, కార్యకర్తలతో కలిసి జాయిన్

వేద న్యూస్, హుస్నాబాద్:
పార్లమెంటు ఎన్నికల వేళ హుస్నాబాద్ బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి పార్టీకి గుడ్ బై చెప్పారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందర కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సోమవారం తిరిగి సొంతగూటికి చేరారు. బీజేపీ తరఫున హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన శ్రీరామ్ చక్రవర్తి లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ బీజేపీ ఇన్ చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఇతర ముఖ్య నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో నాయకులు, కార్యకర్తలందరికీ హస్తం పార్టీ కండువా కప్పి వారందనీ పార్టీలోకి సీఎం రేవంత్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ఇన్ చార్జి సెక్రటరీ రోహిత్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీని మర్యాదపూర్వకంగా కలిశారు.