• వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్: 

ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు.లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గపరిధి 106 – వరంగల్ (తూర్పు)నియోజక వర్గానికి సంబందించి స్వీప్-2024(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఏలక్టోరల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమం లో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ట్రాన్స్ జెండర్ లకు ఓటు అవగాహన పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్త,రాష్ట్ర ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు లైలా తో కలిసి అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ లను శివ శక్తి రూపం గా భావిస్తారని, తూర్పు నియోజక వర్గంలో 365 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు అంచనా అని అన్నారు. ట్రాన్స్ జెండర్ లు ఓటు హక్కు సాధించుకోవడానికి 2009 నుండి కృషి చేసి సఫలం అయ్యారని,ఇదే క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా సమాజం లోని ప్రజలను చైతన్యం చేసి పోలింగ్ లో పాల్గొనేలా చూడాలని, ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం విడనాడాలని ఒక్క ఓటు ద్వారా ఎంతోమంది ఓటమి గెలుపులు నిర్దారణ అయ్యాయని అన్నారు.

అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేసే రోజును సెలవు దినంగా భావించకుండా దేశ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే రోజుగా చూడాలని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఆందోళన కరమని ఓటు హక్కు పౌరుల బాధ్యత అనే విషయాన్ని మరువరాదని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల ఐకాన్ ట్రాన్స్ జెండర్ లైలా మాట్లాడుతూ నిజాయితీ గా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని ట్రాన్ జెండర్ ల ఐక్యత కారణంగానే ఓటు హక్కు సాదించుకోగలిగామని ఇదే ఐక్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటింగ్ శాతం పెంచడమే కాకుండా సామాజిక మాధ్యమాల వేదిక గా ఓటరు అవగాహన రీల్స్ ద్వారా ట్రాన్స్ జెండర్ లు ఓటర్లలో చైతన్యం కలిగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం అధికారులు ట్రాన్స్ జెండర్ లతో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పి డబ్ల్యు డి నోడల్ అధికారి సత్యవాణి, సెక్రటరీ విజయలక్ష్మి, టి పి ఆర్ ఓ కోలా రాజేష్ కుమార్, నర్సంపేట స్వీప్ నోడల్ అధికారి వింధ్య రాణి, టి ఏం సి రమేష్, జిల్లా ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు రంజిత ,కమ్యూనిటీ ఆర్గనైజర్ లతో పాటు ట్రాన్స్ జెండర్ లు అశ్విని, రోషిణి ,రేష్మా, మేఘన, స్వప్న, రాధ, తదితరులు పాల్గొన్నారు.