వేద న్యూస్, కమలాపూర్ :

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి మర్రిపెల్లి కి వెళ్లే రోడ్డు భారీ వాహనాల కారణంగా పూర్తిగా గుంతల మాయమైంది. మొన్న కురిసిన వర్షాలకు ఆ గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాలు అటువైపుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వర్షపు నీరు పూర్తిగా రోడ్డుపైనే నిలిచి ఉండడంతో గుంతలు ఎక్కడున్నాయో, రోడ్డు ఎక్కడుందో గుర్తించలేకుండా ఉంది.

వాహనాలు అటువైపుగా వెళ్లాలంటే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో మర్రిపెల్లి గూడెం నుండి మర్రిపెల్లి వరకు తారు రోడ్డు వేయగా ఇటీవలే నూతనంగా అక్కడ రైస్ మిల్లు నిర్మించగా ఆ రైస్ మిల్లుకు నిత్యం అధిక లోడుతో భారీ వాహనాలు తిరుగుతుండడంతో రోడ్డు పై పూర్తిగా గుంతలు ఏర్పడి ధ్వంసం అయిందని, మిల్లు యాజమాన్యం కనీసం గుంతలు కూడా పూడ్చకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.

మొన్న కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా తయారైందని, రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మిల్లుల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.