వేద న్యూస్, మొగుళ్ళపల్లి : 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు  మంగళపల్లి శ్రీనివాస్  అద్యక్షతన భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి అంబేద్కర్ 89వ  వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  మొగుళ్లపల్లి మాజీ తాజా సర్పంచ్ మోటే ధర్మన్న హాజరై రమాభాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రమాభాయి అంబేద్కర్ మరణించి నేటికి 89 సంవత్సరాలని తెలిపారు.  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రమాభాయిని వివాహం చేసుకున్న తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించారన్నారు. తన కుటుంబానికి ఎంత భారమైన అంబేద్కర్ కు తెలియకుండా కుటుంబాన్ని నడిపించిన మాతా రమాభాయి అని తెలిపారు. తన కుమారులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తన జాతి కోసం అంబేద్కర్ ను ముందుకు నడిపించిన త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  విజయంలో ఆమె పాత్ర కీలకమైందని తెలిపారు.  భారత దేశంలో ప్రజలే తన కుమారులుగా భావించిందన్నారు. రమా భాయి అంబేద్కర్ 27 మే 1935న మరణించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు మంద స్వామి, మంద సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎలేటి శివారెడ్డి, మహమ్మద్ రఫీ, చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.