Oplus_0

వేద న్యూస్, కాజీపేట :

కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట శివారులో గల సాయినాథ్ ఎస్టేట్స్ (వెంచర్) లో  దారుణం చోటు చేసుకుంది. మడికొండ సీఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం దర్గాతండాకు చెందిన లావుడ్య కుమారి(33) అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై బండరాయితో కొట్టి హతమార్చారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో 100డయల్ ద్వారా మడికొండ పోలీస్ స్టేషన్ కు ఫోన్ రావడంతో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ రక్తపుమడుగులో పడి ఉండటం చూసి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు.

విషయం తెలుసుకున్న ఉన్నత అధికారులు సెంట్రల్ డీసీపీ భారీ, కాజీపేట ఏసీపీ తిరుమల్ ఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలించారు. ఘటనా స్థలంలో మహిళకు చెందిన బ్యాగ్‌లో పర్సు, ఒక జతబట్టలు, ఆధార్ కార్డు, కొంతనగదు ఉన్నాయని గుర్తించారు. అక్కడ దొరికిన ఆధార్ కార్డుపై ఉన్న అడ్రస్ ప్రకారం మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్టు సీఐ తెలిపారు.

క్లూస్ టీం ఘటనా స్థలాన్ని  పరిశీలించి హత్యకు ఉపయోగించిన బండరాళ్లను, కొన్ని వస్తువులను సేకరించింది. హత్యచేసిన చోట తాగి పడేసిన ఖాళీ బీరుసీసాలు ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే హత్యకు ముందు నిందితులు మద్యం తాగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు. భర్త ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. ఈ  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.