- నాన్న మార్గదర్శనంలో ప్రత్యేక సాధన పోరాటంలో
- విద్యార్థిగా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరుబాట
- కేసులను లెక్కచేయకుండా మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర
- ఉద్యమకారుడిగా తన సహచరులతో కలిసి ముందు వరుసలో ప్రవీణ్
వేద న్యూస్, ఇల్లందకుంట:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సబ్బండ వర్గాలు పోరుబాటలో నడిచిన సందర్భం అందరికీ విదితమే. జూన్ 2, 2014న రాష్ట్ర కల సాకారమైంది. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వం అవతరణ వేడుకలను పరేడ్ గ్రౌండ్ వేదికగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా్ట్లు చేస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు పోరాడాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన అన్నం ప్రవీణ్ ఉద్యమకారుడిగా రాష్ట్రసాధన పోరులో తన వంతుగా కీలక పాత్ర పోషించారు. తన తండ్రి అన్నం బీరయ్య మాజీ సర్పంచ్ కాగా ఆయన మార్గదర్శనంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాడాలనే సంగతి ప్రవీణ్ తెలుసుకున్నారు. తల్లిదండ్రులు బీరయ్య, లలితల ప్రోత్సాహంతో చదువులో రాణించిన ప్రవీణ్ సమాజ శ్రేయస్సు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రసాధన కోసం తన వంతు పోరు చేసిన ఉద్యమకారుడు ప్రవీణ్ అన్నంపై ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..
తెలంగాణ ఉద్యమ కేసులు:
FIR NO.1: 338/12, Sec of law:- 435,427,504,r/w 34 IPC
FIR NO.2: 339/12, Sec of law:- 160 IPC
FIR NO.3: 340/12, Sec of law:- 427,504,506r/w 34 IPC
శిక్షకాలం -7 రోజులు
తండ్రి బీరయ్యతో కలిసి ‘సింహ గర్జన’కు..
తండ్రి ప్రజాప్రతినిధిగా ఉండటంతో నిత్యం ఇంట్లో చర్చలతోనే సమయం గడిచేది. తన తండ్రి స్వయంగా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, హౌజ్ లోపల ఉద్యమ పాటలు వినడం ప్రవీణ్ మనసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసే ఉద్యమ ఆవశ్యకత ముద్ర పడిపోయింది. అప్పట్లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన ‘సింహ గర్జన’ సభకు తండ్రి, గ్రామస్తులతో కలిసి హాజరైన ప్రవీణ్..తెలంగాణకు ఆంధ్ర పాలకుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు.
నీళ్లు-నిధులు-నియామకాల త్రయం తెలుసుకుని అతనిలో..తెలంగాణ ఉద్యమ స్పృహ రెట్టింపయింది. ప్రవీణ్..ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో ఓయూ విద్యార్థి నాయకుడు నాయకుడు కాసోజు శ్రీకాంతచారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29న ఆత్మాహుతికి యత్నించినప్పుడు తెలంగాణ విద్యార్థిలోకమంతా పరాయి పాలన మీద భగ్గున మండింది. ఆ సందర్భంలో ప్రత్యక్ష ఉద్యమానికి ప్రవీణ్ ఆకర్షితుడయ్యారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి టీఆర్ఎస్ పార్టీ, జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందించి ఉద్యమంలో పాల్గొన్నారు.
ప్రవీణ్ చేపట్టిన పదవులు-బాధ్యతలు
2010లో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో టీఆర్ఎస్వీలో నియోజకవర్గ ఇన్‌చార్జి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జవాజీ కుమార్ (జెకె) పిలుపు మేరకు జమ్మికుంట మండల స్థాయిలో టీఆర్ఎస్వీ జమ్మికుంట మండల కార్యదర్శిగా, 2010 నుంచి 2011 వరకు, టీఆర్ఎస్వీ జమ్మికుంట మండల ఉపాధ్యక్షుడిగా, మండల కల్చరల్ ఇన్‌చార్జిగా 2011 నుంచి 2013 వరకు వ్యవహరించారు. అప్పటి హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటల రాజేందర్ ఆశీస్సులతో జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు సిద్ధం వేణు , నియోజకవర్గ ఇన్ చార్జి జవాజ్ కుమార్ జెకె , మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము అశోక్ సహకారంతో ప్రవీణ్‌ను టీఆర్ఎస్వీ జమ్మికుంట మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో 2013 నుంచి 2017 వరకు కొనసాగారు.
వీల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సాగిస్తున్న అరెస్టులను నిరసిస్తూ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రవీణ్ నాయకత్వంలో పాతర్లపల్లి గ్రామంలో వీల్ ఫోన్ టవర్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీమాంధ్రనేతల దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ విద్యార్థి ఐకాస పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను పాతర్లపల్లి గ్రామంలో దహనం చేశారు. కార్యక్రమంలో దబ్బేట రాజు, మౌటం సంపత్, చల్లూరు ధనుంజయ్, అన్నం కర్ణాకర్ చల్లూరి చిరంజీవి, రాం శివ, సతీష్ ప్రవీణ్ వెంట ఉన్నారు.
మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని అలాగే 14 ఎఫ్ నిబంధన తొలగించిన తర్వాతే ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో పాతర్లపల్లి గ్రామంలో విద్యార్థుల తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించి మోకాళ్లపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
రిలే నిరాహార దీక్షల శిబిరం ఏర్పాటు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పాతర్లపల్లి గ్రామంలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసి నిత్యం ఆ శిబిరంలో రిలే నిరాహార దీక్షలని కొనసాగించారు. ఆ దీక్షలో ప్రవీణ్ వెంట కోడం బిక్షపతి, దెబ్బెట రాజు, చల్లూరి ధనంజయ్, రామ్ తిరుపతి, రామ్ సతీష్, ములుగురి శ్రీనివాస్, రామ్ అశోక్, సమ్మయ్య, కరుణాకర్, గ్రామస్తులు ఉన్నారు.
జమ్మికుంట పీఎస్ ముట్టడి
2010 సంవత్సరం నవంబర్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టు నిరసిస్తూ టీఆర్ఎస్వీ నాయకులందరితో కలిసి జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. అనంతరం పీఎస్ ఎదుట బైఠాయించారు. విద్యార్థులను వెంటనే విడిచి పెట్టాలని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అప్పటి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
అప్పటి తెలంగాణ ప్రాంత మంత్రుల దిష్టిబొమ్మలు దహనం
తెలంగాణ ప్రాంత మంత్రులు పదవులను అంటిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వారి దిష్టిబొమ్మను జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద దహనం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు మంత్రులు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి గాంధీ చౌక్ వద్ద రాస్తారోకో చేసీ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరిపై ఆగ్రహిస్తూ ఐకాస ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
చంద్రబాబు పోరుబాట అడ్డుకుంటామని ప్రకటన
తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన పోరుబాట అనే కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో సాగనివ్వమని విద్యార్థి జేఏసీ నుంచి ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పోరుబాటను అడ్డుకుంటామని విద్యార్థి పక్షాన తెలిపారు. జమ్మికుంట పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి జేఏసీ నాయకులందరితో కలిసి పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. పోరుబాటను అడ్డుకునేందుకు వెళ్తున్న వారందరినీ పోలీసులు ఆపి అరెస్టు చేసి ఆ కార్యక్రమం రోజంతా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఆ ప్రోగ్రాంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరామ్ శ్యాం, టీఆర్ఎస్వీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి జవాజ్ కుమార్, కొమ్ము అశోక్, పొడేటి అనిల్, రాజు, కారింగుల రాజేందర్, రియాజ్, ప్రశాంత్, తదితరులున్నారు.
గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మ దహనం
అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను పాతర్లపెల్లి గ్రామంలో దహనం చేశారు. గ్రామ పరిసర గ్రామాల కార్యకర్తలు పంచాయతీ కూడలీ వద్ద గండ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేసి, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. స్థానిక నేతలు ప్రవీణ్ వెంట ఉన్నారు.
వైసీపీ, టీడీపీ గద్దెల కూల్చివేత
‘‘మా తెలుగు తల్లి’’ గీతం ముద్రించిన ప్రతులను విద్యార్థులతో కలిసి దహనం చఏశారు. ఆ సందర్భంగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పూర్తిగా సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తెలంగాణ విద్యార్థుల బలిదానాలకు కారణమవుతున్న సమైక్యాంధ్ర పార్టీల ఉనికి తెలంగాణలో కనిపించవద్దని తన బృంద సభ్యులతో కలిసి 2012లో ప్రవీణ్ వైసీపీ, టీడీపీల జెండా గద్దెలను కూల్చి ఆ పార్టీ ఫ్లెక్సీలను కాల్చివేశారు.
2012 డిసెంబర్ నెలలో జరిగిన ఈ ఘటనతో జమ్మికుంట పట్టణంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఆరోజు తెలంగాణ వాదులకు వైసీపీ కార్యకర్తలకు బాహాబాహీ జరగగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మికుంట పోలీసులు వీరంగం చేశారు. తెలంగాణ వాదులపై లాఠీ ఝుళిపించారు. ఆ సందర్భంలో టీఆర్ఎస్వీ నాయకులందరికీ లాఠీ దెబ్బలు తగిలాయి. హుటాహుటిన అప్పటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘటనా స్థలి జమ్మికుంట పట్టణ గాంధీ చౌరస్తాకు చేరుకొని సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంలో వైఎస్ఆర్‌సీపీ బాధ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి తమ మీద పోలీసులకు ఫిర్యాదు చేసి పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరించినట్టు ప్రవీణ్ పోలీసులకు తెలిపారు. పోలీసులు పెట్టిన కేసుల్లో అన్నం ప్రవీణ్, కొమ్మ అశోక్, దెబ్బేట రాజులు ఏడు రోజులు జైలు శిక్ష అనుభవించారు.
తహశీల్దార్ ఆఫీసుపై నల్లజెండా..
2012 సెప్టెంబర్‌లో జేఏసీ పిలుపులో భాగంగా ‘కరీంనగర్ కవాతు’లో పాల్గొన్నారు. నవంబర్ 1న తెలంగాణ నాయకులతో కలిసి ‘ద్రోహం ద్రోహం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు విద్రోహం’ అని నినాదాలతో 2013లో నవంబర్ 1 న టీఆర్ఎస్వీ బృందం తహశీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారను. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తలుపులు మూసి వేశారు. అప్పుడు ప్రవీణ్ స్వయంగా నల్ల జెండా ఆఫీసు మీద ఎగురవేయాలని ఆ కార్యాలయ విండో ద్వారా బృందం సహాయంతో వెళ్లారు. కార్యాలయం మీదికి ఎక్కి నల్ల జెండా ఎగురవేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలో గల అంబేద్కర్ కూడలి వద్ద సమైక్యాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆ తర్వాత రోజు నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను ఇల్లందకుంటలో దహనం చేశారు.
పోలీసుల కళ్లుగప్పి వెంటిలేటర్ ద్వారా బయటకు..
2011లో జేఏసీ ఇచ్చిన ‘మిలియన్ మార్చ్’కు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థి నాయకులను అర్ధరాత్రి జమ్మికుంట పట్టణ పోలీసులు అరెస్టు చేసి బైండోవర్ చేశారు. 2011లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ‘రైల్ రోకో’ పిలుపునకు నాటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పాల్గొనకుండా అరెస్టు చేసి జమ్మికుంట కొత్త పత్తి మార్కెట్ కార్యాలయంలో నిర్బంధించారు. ఆ సందర్భంలో ఎలాగైనా ఆ కార్యక్రమానికి చేరుకోవాలని ఉద్దేశంతో పోలీసుల కళ్లు కప్పి ప్రవీణ్ తన ఉద్యమ సహచరుడు కొమ్ము అశోక్ ఆ కార్యాలయంలో వాష్ రూమ్ లో ఉన్న వెంటిలేటర్ ద్వారా బయటికి వచ్చారు. కేశవాపూర్ నుంచి వస్తున్న ఆటో మిత్రుని సహాయంతో ఉప్పల్ ‘రైల్ రోకో’ కార్యక్రమానికి చేరుకున్నారు. అక్కడ వీరిని చూసిన అప్పటి జమ్మికుంట పట్టణ సీఐ సుందరగిరి శ్రీనివాస్..మళ్లీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు..
జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ‘అసెంబ్లీ ముట్టడి’ లో పాల్గొనేందుకు ప్రవీణ్, కొమ్ము అశోక్, రాజు, నరేష్ లు పోలీసుల కంట పడకుండా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కవి, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఇంట్లో షెల్టర్ తీసుకొని..అసెంబ్లీ ముట్టడికి మిట్టపల్లి సురేందర్ తో కలిసి అసెంబ్లీ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తూ కాలినడకన ప్రయాణం మొదలు పెట్టారు. అసెంబ్లీ నలుదిక్కుల పోలీసు బందోబస్తు అక్రమ అరెస్టులు పోలీసులను తప్పించుకొని ఎలాగైనా అసెంబ్లీ వద్దకు చేరుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు. అసెంబ్లీ చేరుకునేందుకు ప్రయత్నించారు.
2013లో 5 వేల మందితో ‘మహా ర్యాలీ’
జేఏసీ ఇచ్చిన సకల జనుల సమ్మె పిలుపు మేరకు విద్యార్థి సంఘంగా వంటావార్పులతో, ధర్నాలతో, రాస్తారోకోలతో, ర్యాలీలతో, బందులతో, దిష్టిబొమ్మల దహనంతో, సమావేశాలతో, నిరాహార దీక్షలతో, నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. 2013 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని జమ్మికుంట పట్టణంలో గల అన్ని కళాశాలల పాఠశాలల 5 వేల మంది విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్వీ, ఎన్‌ఎస్ యూఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.