వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు చేయని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు పసుపు బోర్డు తీసుకురావడంలో చాలా కృషి చేశారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని రెడ్డి పేర్కొన్నారు.
మాట ఇచ్చిన ప్రకారం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారమైందని వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మ పేరు మీద ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ రూ.900 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ మోడీని మరిచిపోరని వివరించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ రావు, తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, రాంరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.