•  హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌కు కాంగ్రెస్ నేత దేశిని కోటి ప్రశ్న

వేద న్యూస్, జమ్మికుంట:

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కులవృత్తుల వారికి బీసీ లోన్లు లక్ష రూపాయల కోసమై ఈ ప్రాంత ప్రజలు బీసీ కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని.. తహశీల్దారు ఆఫీస్ చుట్టూ వాళ్ల పనులు మానేసి తిరిగి రెండు మూడు వేల రూపాయల ఖర్చు పెట్టుకుని బీసీ సర్టిఫికెట్ తీసుకొని బీసీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేశిని కోటి గుర్తుచేశారు. జమ్మికుంట వినాయక గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు అందరికీ బీసీ లోన్లు మంజూరు అయ్యాయని, చెక్కులు వచ్చాయని తన వద్దే ఉన్నాయని కౌశిక్ రెడ్డి చెప్పారని తెలిపారు. నియోజకవర్గంలో బీసీ లోన్లు ఎంతమందికి వచ్చాయో, ఏ గ్రామానికి ఎన్ని చెక్కులు పంచారో కౌశిక్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీ లోన్లు మొత్తం ఏం చేశారో బహిరంగపరచాలని హుజూరాబాద్ ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో బీసీ బిడ్డలందరూ ఏ గ్రామానికి ఎన్ని బీసీ లోన్లు మంజూరు అయ్యాయో కౌశిక్ రెడ్డి చెప్పేదాకా నిలదీయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.