- గ్రామ అభివృద్ధిలో ‘గుడి’ది చెరగని ముద్ర
- పంచాయతీ కార్యదర్శిగా సమర్థవంతంగా మనోహర్‌రెడ్డి విధులు
- జీపీకి పుష్టిగా ఆదాయ వనరులు సమకూర్చిన యువ అధికారి
- అభివృద్ధికి మారు పేరుగా గ్రామాన్ని తీర్చిదిద్దిన సెక్రెటరీ
- అందరి ఆదరాభిమానాలు చూరొగన్న మంచి మనసున్న మనిషి
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండల పరిధిలోని విలాసాగర్ గ్రామాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చడంలో పంచాయతీ సెక్రెటరీగా గుడి మనోహర్‌రెడ్డి పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఒకనాడు గ్రామంలో పచ్చదనం ఆనవాళ్లు లేకుండా, పరిశుభ్రత జాడ కనుమరుగై, ఆదాయ వనరుల ఊసే లేని నేపథ్యంలో ఆయన పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి తన విధులను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తించి..గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు.
గ్రామ రూపురేఖలు మర్చిన యువ ఆఫీసర్
2019 అక్టోబర్ 10న విలాసాగర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించిన గుడి మనోహర్‌రెడ్డి తన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ఊరిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. ‘పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు’ అనే మాటను ఆచరణలో అనుసరించి అద్భుతాలు సృష్టించారు.
ఒక్కొక్కటిగా కార్యక్రమాలు చేపడుతూ..గ్రామ పంచాయతీకి ఆస్తులను సృష్టించారు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఊరికి అక్కరకు వచ్చే పనులను చేశారు. పల్లె ప్రకృతివనం, శానిటేషన్ వర్క్స్, కంపోస్ట్ తయారీ, నర్సరీ, వైకుంఠ ధామం, ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు ఇలా ఒక్కటేమిటి..అన్ని పనుల్లోనూ గుడి మనోహర్‌రెడ్డి తన మార్క్ పనులు చేపట్టి..ఆదర్శ, ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపారు. ఈ క్రమంలోనే జీపీకి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు వరించి వచ్చాయి.
గ్రీన్ విలేజ్‌గా ‘విలాసాగర్’
ప్రభుత్వ ఉద్యోగులు అనగానే సమయానికి ఇలా వచ్చి అలా టైం కాగానే వెళ్లిపోతారనే అపవాదు ఉంది. కానీ, దానికి భిన్నంగా గుడి మనోహర్‌రెడ్డి పంచాయతీ సెక్రెటరీ హోదాలో ప్రతి రోజూ సమయ పాలన పాటిస్తూనే..24 గంటలు గ్రామ అభివృద్ధియే లక్ష్యం అన్న మాదిరిగా పని చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాడు జీపీ పరిధిలో ఉండే షెడ్డులు పశువులు కట్టేసే ప్రదేశంగా మురికికూపంగా మారి దయనీయ స్థితిలో ఉండగా, వాటిని పూర్తిగా మార్చేశారు. కరీంనగర్ జిల్లాలోనే తొలిసారిగా కంపోస్టు తయారీ చేపట్టారు. ఇప్పటికే పలు మార్లు కంపోస్టు తయారు చేసి అందజేశారు. కంపోస్టు షెడ్డును సైతం సుందరంగా.. ప్యాలెస్ మాదిరిగా తీర్చిదిద్దారు.
ప్రకృతివనం ఒక ‘చిట్టడవి’
ప్రస్తుత నాగరిక ప్రపంచంలో కోతుల బెడద తీవ్రసమస్యగా మారింది. అడవులు క్రమంగా అంతరించిపోతోండటంతో కోతులు ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతుల బెడద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు..వాటికి ఆహారం అందజేసేందుకు కోతుల ఆహారకేంద్రం(మంకీ ఫుడ్ కోర్ట్) ఏర్పాటు చేశారు. రెండు ఎకరాల్లో 2,600 మొక్కలను నాటి నందనవనం మాదిరిగా ప్రకృతివనం సృష్టించారు.
ఇది ఒక చిట్టడవిలా ఉంటుందని పేర్కొనడం అతిశయోక్తి కాదు. తీరొక్క పూలు, పండ్ల మొక్కలు మధ్యలో అందమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణంతో విలాసాగర్ ప్రకృతివనం ‘అహో.. ప్రకృతికి సలాం’ అన్నట్టుగా ఏర్పాటు చేశారు. అడవి తంగేడు, దురశన, రావి, చింత, వేప, ఉసిరి, మామిడి, పనస, జామ, రేగుఫలం, బాదం, సపోటా, వాటర్ ఆపిల్ వంటి తదితర మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీ నుంచి తెప్పించి ప్రకృతివనంలో నాటారు. అవి ఏపుగా పెరిగి ఇప్పుడు అందంగా కనబడుతున్నాయి.
కోతులకు ఆహరం కోసం ప్రత్యేకంగా పండ్ల మొక్కలు సుమారు 1,600, గ్రామంలో హనుమాన్ గుడి వద్ద 2,000 మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 వేలు మొత్తంగా 10 వేలకు పై చిలుకు మొక్కలను నాటించారు. ఒక పక్క మానేరు పరివాహక ప్రాంతం, మరో పక్క రైల్వే గేటు ఉండి..కరీంనగర్ జిల్లాలోనే చివరి గ్రామంగా ఉన్న ‘విలాసాగర్’ను ప్రగతి ప్రథంలో ప్రథమ స్థానంలో నిలపడంలో మనోహర్‌రెడ్డి కృషి నిరుపమానం అని గ్రామస్తులు వెల్లడించారు. మూడు పదుల వయసులో ఉన్న సెక్రెటరీ మనోహర్‌రెడ్డి అనతి కాలంలోనే ఆ శాఖలో మరింత ఉన్నతస్థానానికి వెళ్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
సేంద్రియ ఎరువుల తయారీతో ఇన్కమ్
జీపీ ఆధీనంలో సెంద్రియ కంపోస్టు ఎరువుల తయారీతో జీపీకి ఆదాయం సమకూరేలా సెక్రెటరీ మనోహర్‌రెడ్డి తన హయాంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. క్రీడా ప్రాంగణం, ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డుతో పాటు ఇతర గ్రామ పంచాయతీ సంబంధిత మెయింటెనెన్స్పైన ఫోకస్ పెట్టి.. ప్రజలకు సేవ చేయడంతో ప్రత్యేక గుర్తింపును మనోహర్‌రెడ్డి పొందారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించి..కుటుంబ సభ్యుడిగా, అందరికీ ఆత్మీయుడిగా, అజాతశత్రువుగా మనోహర్‌రెడ్డి పేరు సంపాదించుకున్నారు.
తొలి పోస్టింగ్‌లో విలాసాగర్‌కు సెక్రెటరీగా వచ్చి తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన మనోహర్‌రెడ్డి..భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఈ సందర్భంగా గ్రామస్తులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. ఇటీవల ఆయన బదిలీపై వెళ్లడం తమకు బాధను కలిగించిందని, నీతి, నిజాయితీతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన యువ ఆఫీసర్‌తో పెనవేసుకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకుని గ్రామస్తులు.. ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు.
అంగన్వాడీ స్కూ్ల్, యూపీఎస్ విద్యార్థులు సైతం ఒకింత ఎమోషనల్ అయి, గుడి మనోహర్‌రెడ్డికి ఘనవీడ్కోలు పలికారు. గుడి మనోహర్‌రెడ్డి అధికారిగా తమ గ్రామానికి రావడం అదృష్టమని, ఆయన సేవలను నిరంతరం గుర్తుంచుకుంటామని, తమ హృదయాల్లో ఆయన స్థానం పదిలంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. గ్రామంలోని 400 కుటుంబాల్లో కుటుంబ సభ్యుడిగా, 1,507 మంది జనానికి ఆత్మీయుడిగా మనోహర్‌రెడ్డి విశేష గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన బదిలీపై సైదాపూర్ మండల పరిధిలోని రాములపల్లి గ్రామానికి పంచాయతీ సెక్రెటరీగా వెళ్లారు.
‘ఖాకీ’ కొలువును వదిలి కార్యదర్శిగా
హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గుడి గోపాల్‌రెడ్డి- సరోజన దంపతుల తనయుడు గుడి మనోహర్‌రెడ్డి..తొలుత తనకు వచ్చిన పోలీసు ఉద్యోగాన్ని వదులుకుని మరీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వరంగల్ సెంట్రల్ జైలులో వార్డెన్ ఉద్యోగాన్ని కాదనుకుని పంచాయతీ సెక్రెటరీ జాబ్‌కు వచ్చాడు. ప్రాథమిక విద్యాభ్యాసం, ఇంటర్మీడియెట్ హుజూరాబాద్‌లో పూర్తి చేసిన మనోహర్..డిగ్రీ హన్మకొండలోని గాయత్రి కాలేజీలో చేశారు. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మనోహర్‌రెడ్డి..రైతులు, ప్రజలకు సేవలందించడంలో తన వృత్తి జీవితంలో ముందుంటున్నారు. తల్లిదండ్రులు, సోదరి సహకారంతో వృత్తిజీవితంలో ముందుకు సాగుతున్నారు.
‘విలాసాగర్’ వారి సహకారం మరువలేనిది: మనోహర్‌రెడ్డి
తన తొలి పోస్టింగ్ విలాసాగర్ గ్రామం కాగా, ఆ ఊరి ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జీపీ సిబ్బంది, ప్రతి ఒక్కరి సహకారంతోనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలిగానని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. విలాసాగర్ జీపీ పరిధిలో పనులకు అన్ని వర్గాల నుంచి సహాయ సహకారాలు అందాయని, ఎస్బీఎం(స్వచ్ఛభారత్ మిషన్)తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, ఆఫీసర్ల మద్దతు, గ్రామస్తుల పూర్తి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు నడిపించానని వెల్లడించారు.