•   మండల పంచాయతీ అధికారికి దామెర మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీల వినతి

వేద న్యూస్, వరంగల్: 

గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల సమస్య వలన తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయని, ఆయా ఫెస్టివల్స్ కు ఏర్పాట్లు పంచాయతీ సెక్రెటరీలకు మోయలేని భారం అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి తక్షణమే నిధుల విడుదలకు చొరవ తీసుకోవాలని  పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమమకొండ జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్ ఆధ్వర్యంలో దామెర మండల పంచాయతీ అధికారి కే.వీ.రంగాచారి కి శుక్రవారం  వినతి పత్రం సమర్పించారు. 

ఇప్పటికే జీపీల్లో ఖర్చు పెట్టిన డబ్బులకు ఐఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ చేసిన చెక్కులు సుమారు 10 నెలలుగా క్లియర్ కాలేదని, దీని పర్యవసానంగా ఏ ఒక్క ఏజెన్సీ కానీ ఇతర షాప్ యజమాని కానీ గ్రామ పంచాయతీలకు క్రెడిట్ ద్వారా సామగ్రి ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉన్నదని వినతి పత్రంలో ప్రస్తావించారు. జీపీల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయుటకు చొరవ తీసుకోవాలని కోరారు.

జీపీ సిబ్బందికి కొన్ని నెలలుగా శాలరీ చెల్లించుటకు ఫండ్స్ లేనందున, రోజువారి కార్యక్రమాలు పారిశుధ్య పనులు, ట్రాక్టర్ డీజిల్‌కు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగి అయినా తన జీతం డబ్బులను తన ఇంటి ఖర్చులకు వాడుకుంటారని కానీ, పంచాయతీ సెక్రెటరీలు మాత్రమే తమ జీతాల నుంచి అత్యవసర పనులకు ఖర్చు చేయవలసి వస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు చొరవ తీసుకుని ప్రతిపాదనలు పంపించాలని కోరారు.

 కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శుల ఫోరం దామెర మండల అధ్యక్షుడు అర్థం శ్రీనివాస్, పరకాల డివిజన్ అధ్యక్షుడు మనోహర్ , కార్యదర్శులు వేణు మాధవ్, సరళ, సిరి వెన్నెల, కవిత, రజిత, సందీప్, మనిదీప్, ధర్మారెడ్డి, రామ్మూర్తి, అన్నపూర్ణ పాల్గొన్నారు.