వేద న్యూస్, వరంగల్:
‘తనతో పాటు పుట్టి పెరిగిన ఊరుకు సైతం పేరు సంపాదించి పెట్టినపుడు నిజంగా ప్రయోజకులైనట్టు’ అనే పెద్దల మాటలు బహుశా ఆ యువకుడి మదిలో చిన్ననాటనే నాటుకుపోయాయో ఏమో.. తెలియదు. కానీ, తన ప్రతిభతో అంచెంలచెలుగా ఎదిగి పర్యావరణహిత ఆవిష్కరణ చేసి.. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలో పీహెచ్‌డీ సైతం సంపాదించి..తన కుటుంబంతో పాటు ఆ గ్రామానికి గౌరవం లభించేలా చేశాడు సదరు యువకుడు. యువకుడి పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం కావడం విశేషం.
మట్టిలో మాణిక్యం అరుణ్
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని దోనిపాముల గ్రామానికి చెందిన రాచమల్ల పద్మ–వెంకటేశ్వర్లు ..దంపతుల రెండో సంతానం అరుణ్ కుమార్.. చిన్న నాటి నుంచి చదువులో ముందున్నారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించిన అరుణ్..నల్లగొండ ఆల్ఫా జూనియర్ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివారు. అనంతరం ఆలిండియా లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ‘గేట్’లో ఉత్తీర్ణత సాధించి వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యారు. ఇటీవల అరుణ్‌కు నిట్‌లో డాక్టరేట్ ప్రదానం చేశారు.
ప్రకృతి హిత ఆవిష్కరణకు భారత పేటెంటు
జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రసాయన విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. నాగరాజన్ వద్ద పీహెచ్‌డీ విద్యార్థి అరుణ్ చేసిన ఆవిష్కరణకు భారతీయ పేటెంటు దక్కడం విశేషం. క్లాత్ సెమీకండక్టర్ ‘గ్లైకోజెల్ నాప్తాలిమైడ్స్’ ఎన్-గ్లైకేజెల్ నాఫ్తాలిమైడ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అనే అంశంపై అరుణ్ చేసిన పరిశోధనకు పేటెంటు లభించింది. సాధారణంగా విద్యుత్తు ఉపకరణాల్లో వినియోగించే సెమీకండక్టర్ చిప్‌లు గడువు తీరాక ఈ-వ్యర్థాలుగా మారి పర్యావరణానికి హాని చేస్తాయి.
ఇప్పుడు పరిశోధకులు వెలికితీసిన అణుపదార్థం కాటన్ వస్త్రంతో కలిపితే సెమీకండక్టర్‌గా మారుతోంది. 8 వోల్టుల సామర్థ్యమున్న ఈ చిన్నపాటి బట్ట నుంచి 8 నానో ఆంపియర్స్ విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ తరహా సెమీకండక్టర్లను తక్కువ ఖర్చుతో రూపొందించొచ్చని, వాటికి భూమిలో కరిగిపోయే లక్షణం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మాలిక్యూల్ తయారీకి వాడిన రసాయనాలు హానికారకం కావని వివరించారు. వీరి పరిశోధన లండన్‌కు చెందిన ‘గ్రీన్ కెమిస్ట్రీ జర్నల్’లో ప్రచురితమైంది. ఈ మాలిక్యూల్‌కు క్యాన్సర్‌పై సమర్థంగా పని చేసే లక్షణమూ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
9 రీసెర్చ్ పేపర్లు, 3 బుక్ చాప్టర్లు, ఒక పేటెంటు
వ్యవసాయ కుటుంబానికి చెందిన అరుణ్ .. పరిశోధనాంశం వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లోనూ ప్రచురితమయ్యారు. అరుణ్ తన పీహెచ్‌డీలో 9 రీసెర్చ్ పేపర్లు, 3 బుక్ చాప్టర్లు, ఒక పేటెంటు కలిగిఉన్నారు. పీహెచ్‌డీ సమయంలో అరుణ్ కుమార్ 4 నెలలపాటు ఇజ్రాయెల్‌లో విజిటింగ్ రీసెర్చ్ ఫెలోగానూ పనిచేయడం విశేషం.
ఆటుపోటులకు ఎదురునిలిచి.. ఉన్నతంగా ఎదిగిన యువకుడు
అరుణ్ చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తున్నారు. దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అరుణ్..కష్టాలకు భయపడకుండా వాటికి ఎదురునిలిచి పోరాడి గెలిచి ముందుకు సాగుతూ..ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ భువనగిరిలో చదువుల్లో ముందు వరుసలో నిలిచి చిన్న నాటనే రూ.500 ప్రైజ్‌ను గెలుచుకున్నారు.
స్కూల్ ఫస్ట్‌గా నిలిచిన అరుణ్.. ఇంటర్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. డిగ్రీ చదువుతున్న సమయంలో మొదటి సంవత్సరంలో అరుణ్ మాతృమూర్తి కాలం చేయడంతో పాటు తన తండ్రి అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆర్థిక పరిస్థితులరీత్యా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రిలయన్స్ ఫ్రెష్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తూ.. ఇంట్లో డబ్బులు అడగకుండా తన ఖర్చులు తానే భరిస్తూ.. డిగ్రీ పూర్తి చేశారు.
సామాజిక స్పృహ కలిగిన విద్యార్థిగానూ అరుణ్ ముందు వరుసలో
అరుణ్..కేవలం ర్యాంకులు సాధించిన విద్యార్థిగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన విద్యార్థిగా ముందుకు సాగారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నేతగా సమస్యలపై తన గళాన్ని వినిపించారు. కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
మరిన్ని ప్రకృతిహిత ఆవిష్కరణలకు ప్రయత్నిస్తా: అరుణ్
యువత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధనకు కార్యోన్ముముఖులు కావాలని ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశాన్ని అరుణ్ వంట పట్టించుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతిష్టాత్మకమైన జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) వరంగల్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. అరుణ్ కుమార్ భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. తనకు డాక్టరేట్ లభించడంతో పాటు పరిశోధనకు పేటెంటు లభించడం పట్ల అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ఉపయోగపడేలా, ప్రకృతి హిత ఆవిష్కరణలు మరిన్ని చేసి దేశసేవలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తానని ఈ సందర్భంగా అరుణ్ వెల్లడించారు.