వేద న్యూస్, మరిపెడ: 

మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు.

వంట గదిలో కిరోసిన్, పెట్రోల్ లాంటి విస్ఫోటనం చెందే పదార్థాలు ఉంచకూడదని చెప్పారు. వంట చేయడము పూర్తవగానే రెగ్యులేటర్ ఆఫ్ చేసి పెట్టాలని సూచించారు. వంట చేసే సమయంలో సెల్ ఫోన్ వినియోగించకూడదని తెలిపారు.

ఊరికి వెళ్లేటప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలన్నారు. సిలిండర్ తీసుకున్నప్పుడు ఎక్స్‌పైరీ  డేట్ చెక్ చేసుకోవాలని వెల్లడించారు. అందులో గ్రూప్ ఏ అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, గ్రూప్ బి అనగా ఏప్రిల్, మే, జూన్, గ్రూప్ సి, అనగా జులై, ఆగస్టు సెప్టెంబర్, గ్రూప్ డి అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఉపయోగించాల్సిన తేదీలుగా అర్థం చేసుకోవాలని వివరించారు.

వంటగదిలో గ్యాస్ వాసన వచ్చినప్పుడు క్యాపు పెట్టి ఉంచి, గ్యాస్ స్ప్రెడ్ కాకుండా ఉంచి, గ్యాస్ సంస్థ వారికి సమాచారం అందజేయాలని సూచించారు. గ్యాస్ స్టవ్ వెలిగించే సమయంలో మంటలు వచ్చి ప్రమాదం జరిగినట్లయితే, గ్యాస్ బండపై తడిపిన గోనె సంచి వేసి మంటలు ఆర్పేయాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులకు గ్యాస్ ఉపయోగించడం పై అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ బయగాని రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఈ విషయాలన్నీ పాటిస్తూ, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

సమావేశంలో ఇండేన్ గ్యాస్ ప్రొప్రైటర్ పోలోజు సురేష్, శ్రీ సాయిరామ్ ఇండేన్ గ్యాస్ షోరూం స్టాఫ్ వెంకటేశ్, శ్రీకాంత్, నవీన్, మహబూబ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.