వేద న్యూస్, ఖిలావరంగల్ :
బాలల దినోత్సవం (జవహర్ లాల్ నెహ్రూ జయంతి) సందర్భంగా నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గా ఇత్రత్ ఆనమ్ ఫాతిమ, ఇంచార్జి ప్రిన్సిపాల్ గా ఎస్ సుధీర్, పీఈటి గా బి లోకేష్, 17 మంది విద్యార్థులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులుగా వ్యవహారించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
అనంతరం ప్రిన్సిపాల్ పంచకం రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంత ఓపికతో బోధిస్తున్నారో అర్థమయిందని, వారు చెప్పే విషయాలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటామని తెలిపారు.
అలాగే వారు ఎంచుకున్న లక్ష్యాలను తెలియజేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ పంచకం నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో, సమాజంలో ఎలా వ్యవహరించాలో స్వయంగా వారే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు.
ఉపాధ్యాయులు ఎంత కష్టపడి పాఠాలు బోధిస్తున్నారో అర్థం చేసుకుని శ్రద్ధగా చదివి మీరు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అనంతరం చక్కగా తమ విధులను నిర్వర్తించిన ఉపాధ్యాయ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాళ్లు కె అశ్విని, ఎ నర్మద, కె దివ్య శ్రీ, యాస్మీన్, జె స్వప్న, కె రజిత, ఆఫ్రీన్, సిమ్రాన్, ఎ సుష్మిత, హెచ్ స్పందన, విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.