వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న శిశుమందిర్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. 1973లో స్థాపితమైన శిశుమందిర్ స్వర్ణోత్సవ కార్యక్రమాల కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, ఆవాస విద్యాలయం సమితి అద్యక్షులు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.25 వేలు స్వచ్ఛందంగా విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన సరస్వతి శిశుమందిరము స్వర్ణోత్సవ కార్యక్రమము జరుపుకోబోతున్నదని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా తనకు ఈ విద్యాలయముతో అనుబందము ఉన్నదని తెలిపారు. తాను గత 10 సంవత్సరాలుగా ఈ పాఠశాల ప్రబంధకారిణీ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. లాభాపేక్ష లేని సంస్కార కేంద్రాలైన శిశుమందిరాలు దిగ్విజయంగా నడవడానికి గల ముఖ్య కారణం సమాజ సహాయ సహకారాలేనని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా పోషకులు, హితైశులు, దాతలు శిశుమందిరాలను ఆదరించి పోషిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.