వేద న్యూస్, కమలాపూర్ :

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల శోభన్ కుమార్ ఇటీవలే సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన సందర్భంగా పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పుల్లా వంశస్థులు పలువురు మాట్లాడుతూ పుల్ల శోభన్ కుమార్ యువతకు ఆదర్శమని, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వరకు ఆయన ఎదిగిన తీరు, ఆయన క్రమశిక్షణ, పట్టుదల చూసి నేటి యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు.

అనంతరం సన్మాన గ్రహీత సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పుల్ల శోభన్ కుమార్ మాట్లాడుతూ తనకు పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం పట్ల వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని, కష్టాలు, నష్టాలు, అవమానాలు, ప్రశంసలు అనుభవించానని, కానీ వేటికి తలొగ్గకుండా అన్నింటిని అధిగమిస్తూ క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.

నేటి సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వారిలో ఒకరికొకరు బేధాభిప్రాయాలు కలగజేసుకొని భవిష్యత్తులో ఎదగకుండా ఒకరికొకరు అడ్డుపడుతూ ఇద్దరూ నష్టపోతున్నారని, నేటి సమాజంలో కొన్ని ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ప్రపంచంతో పోటీపడే విధంగా ముందుకెళ్తుంటే కొందరు మాత్రం వాడలలో, గ్రామాలలో సమస్యలు సృష్టించుకుని, వారి భవిష్యత్తుకు ఎటువంటి ఉపయోగం లేని, అనవసరమైన పంచాయతీలు పెట్టుకొని అక్కడే ఆగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన యొక్క పోలీస్ సర్వీస్ లో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ లాంటి నేరపూరిత వ్యవహారాలలో బలహీన వర్గాలకు చెందిన యువత బలి కావడం తనను బాధించాయని అన్నారు.

ప్రస్తుత సమాజంలో యువత ప్రతి ఒక్కరూ ఉద్యోగాల వేటలో పడుతున్నారని, ఉద్యోగాలతో పాటు, బిజినెస్ రంగం వైపు కూడా దృష్టి సారించాలని, వ్యాపార రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడలలో, గ్రామాల్లో చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకొని మన అభివృద్ధికి మనమే అడ్డుపడుకొని సమాజంలో వెనుకబడిపోవద్దని, ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, ప్రపంచంతో పోటీపడే విధంగా తయారవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ కాన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పుల్లా శ్రీనివాస్, పుల్లా వంశానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.