వేద న్యూస్, వరంగల్ :
అర్హులందరికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు చేరేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు, అందుకు గాను ఈ నెల 16 నుండి 20 వరకు నిర్వహించే క్షేత్ర స్థాయి పరిశీలన, 21 నుండి 25 వరకు గ్రామ, వార్డు సభలకు జిల్లా ప్రజలు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు పథకాల క్షేత్ర స్థాయిలో పరిశీలన, గ్రామసభల నిర్వహణకు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ను జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు, పథకాల వారిగా రైతు బంధు కు జిల్లా వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఆత్మీయ పథకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డిఆర్డిఓ)ను, రేషన్ కార్డులకు జిల్లా పౌరసరఫరాల అధికారి, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జిల్లా పరిషత్తు సీఈవో ను నోడల్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 11 మండలాలు, 32 జిడబ్ల్యూఎంసీ వార్డులు, నర్సంపేట, వర్షన్నపేట వార్డులకు మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో బృందాలను నియమించడం జరిగిందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనుందని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట వేసినా, వేయక పోయినా అందుతుందని, రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి ఎటువంటి పరిమితులు లేవని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12 వేలు రూపాయలను అందించనున్నట్లు, ఒక్కో విడతకు 6 వేల చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనుందని, 2023-24 సంవత్సరానికి ఉపాధి హామీ క్రింద పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలు గా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ద్వారా సొంత భూమి ఉండి ఇండ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేశామని అన్నారు. జనవరి 16 నుండి 20 వరకు గ్రామ, వార్డులలో ఆయా బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని, జనవరి 21 నుండి 25 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, అర్హుల జాబితా గ్రామాల వారీగా సిద్ధం చేసిన తర్వాత, ఏ గ్రామంలో ఎంత మంది అర్హులకు మొదటి విడత ఇల్లు అందించాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను, ఎం పి డి ఓ లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా కలెక్టరేట్లోనీ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 3424 కు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.