వేద న్యూస్, నల్గొండ ప్రత్యేక ప్రతినిధి : 

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదడులో వచ్చిన ఆలోచన “పేదలకు సన్న బియ్యం” అందుకు అభినందనీయం అంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్గ నిర్దేశంలో,రాష్ట్ర పౌరసరఫరాశాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆచరణాత్మకతకు బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అభినందనలు అన్నారు.సోమవారం ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం సరఫరా చేస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక పస్తులు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. దొడ్డు బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఒక పూట తిని కడుపులు మాడ్చుకున్న తెలంగాణ ప్రజల కడుపు నింపాలనే ఆలోచన చేయడం అభినందనీయం, స్వాగతీయం అన్నారు. గతంలో దొడ్డు బియ్యం పై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నిరుపయోగం అవుతుంది అని ఆలోచన చేసి సన్న బియ్యం అనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయమని, ఈ సంకల్పంతో పేద ప్రజల ఆకలి తీర్చాలని ముఖ్యమంత్రి భావించడం అభినందనీయం అన్నారు. పది సంవత్సరాలు పాలన చేసిన భారత రాష్ట్ర సమితి ఈ పథకం గురించి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. గతంలో వరి సాగు చేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పండించుకొని క్వింటాలు 4వేల రూపాయలు పొందిన విషయాన్ని ప్రజలు మరిచిపోరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి 15 నెలల కాలంలో దాదాపు హామీలన్నీ అమలు చేస్తూ వచ్చిందని వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు అందజేయడం ప్రభుత్వ ఆలోచనలో ఉన్నాయని పేదలకు రేషన్ కార్డుల పై సన్నబియ్యం ఇచ్చే పథకం చరిత్రలో నిలిచిపోయే అంశమని “పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి” అని నిజం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.