•  యూట్యూబ్‌లో ట్రెండింగ్
  •  భాష, భావానికి ప్రయారిటీనిస్తూ వినీత్ రూపకల్పన
  •  ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ‘లల్లాయి లాలిజో’ పాట

ప్రైవేటు సాంగ్స్ అంటే ద్వందార్థాలు, అశ్లీలతకు దాదాపుగా కేరాఫ్ అన్నట్టుగా.. సంగీతానికి అంతగా ప్రాధాన్యత లేకుండా కేవలం బీట్ సాంగ్‌కు సిగ్నేచర్ స్టెప్‌లు, డీజే మోతలు ఉండేలా మారుతున్న సందర్భం ఇది.. యూట్యూబ్‌లో ఈ మేరకు రోజుకో పాట రిలీజవుతున్న తరుణంలో.. భాష, భావానికి ప్రయారిటీ ఇస్తూ.. అందమైన పెయింటింగ్‌లా చక్కటి ప్రేమపాటను అందించారు యువకుడు వినీత్ నమిండ్ల. ‘లంబాడి వాడల్లా నువ్వునేను కలవంగ తొలిప్రేమే మొదలయ్యేనే’ అంటూ సాగే ఈ పాట.. దృశ్యమాలికగా.. మధురాతి మధురంగా రూపొందించిన తీరు చూస్తే ఆనందంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులై సంతోషపడాల్సిందే.

 

ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా పాటను చిత్రీకరిస్తూ.. భావాన్ని తెరపైన కళ్లకు కట్టినట్టు చూపుతూ.. ప్రేమను, కుటుంబ బాంధవ్యంగా మలిచిన తీరును చూస్తే.. దర్శకుడిగా వినీత్‌ భవిష్యత్ స్పష్టంగా అవగతమవుతుంది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైన కూడా యువకుడికి సత్తా చాటే టాలెంట్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

గ్రామీణ పదాలతో.. దృశ్య వీక్షణం

సుమారు 5 నిమిషాలు(4.47) సాగే ఈ పాటలో గ్రామీణ దృశ్యాలను చిత్రీకరిస్తూ.. ప్రేమికులుగా ఉన్న యువకుడు, యువతి మధ్య అలతి పదాలు వాడుతూ.. ఒకరిని మరొకరు ఏ విధంగా స్వచ్ఛంగా ఆరాధించగలరో చెప్పడం సాహసమే. అతి తక్కువ సమయంలోనే వీరిరువురి మధ్య ప్రేమను చిగురింపజేయడంతో పాటు వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తూ.. చివరకు సంతోషంగా ప్రేమను కుటుంబ బాంధవ్యంగా మారుస్తూ ‘శుభం’ కార్డు పలకడం దర్శకుడిగా వినీత్ ప్రతిభకు అద్దం పడుతుంది.

సాంగ్ లిరిసిస్ట్, కాన్సెప్ట్, డైరెక్షన్ క్రెడిట్ తీసుకున్న వినీత్ బహుముఖ ప్రజ్ఞకు ఈ పాట ఉదాహరణనే చెప్పొచ్చు. గీత రచయితగా ఆయన ఎంచుకున్న శైలి కూడా ఎంతో చక్కగా ఉంది. ‘నెమలమ్మ నాట్యాలు.. హంస నడకల్లో చూస్తున్నట్టుగా.. ‘పిల్ల’ గాలులు.. ‘ఆమె’ వైపు తీసుకెళుతూ.. ‘దారంతా’ ఆమె రూపు గీసుకొచ్చి.. పొలమారిన సందర్భంలో తలపుల్లో ఉన్నపుడు ‘అతడే’ ఎదురైనట్టుగా.. ఓ వైపున పాటను.. కథలోకి పరిగెట్టిస్తూ.. దృశ్యాన్ని సైతం అత్యద్భుతంగా ఆవిష్కరించడం నిజంగా మెచ్చుకోదగిన విషయం.

చివరగా కన్నవారి దీవెనలు నిండుగా ఉంటేనే .. ఆకాశ తారలు అక్షింతలవుతాయని, కనులు ఆనందంలో తడిసిపోతాయని.. బతుకంతా రెండు ప్రాణాలు ఒక్కటై ‘ఒక్కటే’ ప్రాణంగా సాగిపోతాయని సంకేతాత్మకంగా, సందేశాత్మకంగా పాటలో వివరించారు. ఇక ఈ పాటలో హీరో, హీరోయిన్లుగా కే.గిరిధర్ యమున తారక్‌ల నటన సహజత్వానికి దగ్గరగా ఉండటం విశేషం.

పాటకు ప్రాణంగా గాత్రాన్ని అరువిచ్చిన బి.సుమన్, శ్రీనిధి‌తో పాటు మ్యూజిక్ అందించిన మార్క్ ప్రశాంత్ ‘మార్క్’ సుస్పష్టంగా కనబడుతోంది. డీవోపీ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యద్భుంగా దృశ్యాలు.. ప్రేక్షకుడితో మాట్లాడుతున్నట్టుగా కే.మోజేశ్ చిత్రీకరించారు. ఈ సాంగ్‌ను కృష్ణ లింగబత్తిని ప్రొడ్యూస్ చేశారు.