- ప్రతిపాదనలు సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి
- పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ
వేద న్యూస్, కరీంనగర్:
రాష్ట్ర బడ్జెట్ కరీంనగర్ విద్యారంగాన్ని నిరాశపరిచిందని పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగం బలోపేతం కోసం ఆశించినంతగా నిధులు కేటాయించకుండా..కేవలం (21,389 కోట్లు) 7.75 శాతం నిధులు కేటాయించి నిరాశపరిచిందని పేర్కొన్నారు.
విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోఖానే..తప్పులను సవరించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు ఉన్నదని ఆరోపించారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున..ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నుండి వైదొలగారని వెల్లడించారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.500 కోట్లు కనీస సౌకర్యాలకు కూడా సరిపోవని పేర్కొన్నారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని చెప్పారు. బడ్జెట్లో వాటి ప్రస్తావన చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు గత ప్రభుత్వం నోటిమాటకే సరి పెట్టగా, తాజాగా ఈ బడ్జెట్ లో కూడా వారిలాగా మాటలకే సరిపెట్టలా సంకేతాలు పంపిస్తున్నారని విమర్శించారు.
ఈ బడ్జెట్ లో విద్యారంగా బలోపేతం కోసం విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు విద్యారంగా అభివృద్ధి కోసం ఆశించినంత మేరకు కేటాయింపులు జరగలేదని తీవ్ర నిరాశకు లోనవుతున్నారని స్పష్టం చేశారు. తక్షణమే బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణ చేసి, ప్రొఫెసర్ కొఠారి కమిషన్ ప్రతిపాదించిన విధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు.
లేనియెడల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులు నిరసనలకు గురి కావల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బతుల రాజు, ముల్కల మారుతి, కట్కూరి ఎన్నోస్, బత్తుల అనిల్, లోకిని రమేష్, బరావత్ సన్నీ, అంగిడి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.