- కాలుష్యం నుంచి ఉమ్మడి వరంగల్ రక్షణే లక్ష్యం
- ‘పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక’ కమిటీ సభ్యులు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యావరణ సమస్యల పరిష్కరానికి ఐక్యవేదిక ఏర్పడింది. హన్మకొండ జిల్లా టీచర్స్ కాలనీ ఫేజ్ 2 లో శనివారం ‘పర్యావరణ పరిరక్షణ సదస్సు’ను వివిధ హరితహిత సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఆటవీశాఖ అధికారి కాజీపేట పురుషోత్తం హాజరై మాట్లాడారు. పర్యావరణ సమస్యలపై పరిష్కార దిశగా అన్ని హరిత స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ఉద్యమించడానికి ఒక ఐక్య వేదిక ఏర్పాటు అవసరం అని ఉద్ఘాటించారు.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకూ పెరిగిపోతున్న శబ్ద, వాయు, నీటి, భూ, ఘన విసర్జకాల కాలుష్యం నుంచి జీవకోటిని రక్షించుకునే దిశగా ఈ ఐక్య వేదిక ఉపయోగ పడాలని కోరారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న అన్ని హరిత స్వచ్చంద సంస్థలు ఏకగ్రీవంగా ‘పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక’గా ఏర్పడి తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నాయి.
అధ్యక్షునిగా కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి గా టి. శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా దామోదర్, రాజయ్య, ఉపాధ్యక్షులుగా పిట్టల రవిబాబు, రాజకుమార్, పీఆర్వోగా పరశరాములు, కోశాధికారిగా ప్రభాకరరావు, ముఖ్య సలహాదారులుగా ఎండీ సిరాజుద్దీన్, గౌరవ అధ్యక్షులుగా వి.దేవాచారి, సలహాదారుగా వేణు, సాంకేతిక సలహాదారుగా మధాకర్, న్యాయ సలహాదారుగా వీరభద్ర రావు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఈసీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు బాధ్యులునూ ఎన్నుకున్నారు.