– పెట్టెలో రూ.2 కోట్ల నగదు
వేద న్యూస్, నల్లగొండ:
ఏసీబీ వలకు చిక్కాడు ఓ అవినీతి అధికారి. ప్రజాసేవ చేయాల్సిన ఆ ఆఫీసర్..అందినకాడికి దోచుకున్నాడు. కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. శనివారం తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడులు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకెళితే..నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ రైడ్ చేసింది. ఏసీబీ అధికారులుహైదరాబాద్ లోని ఎల్బీనగర్ షిరిడి సాయినగర్ కాలనీలోని అతని ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ట్రంక్ పెట్టలో..రూ.2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. అలాగే కిలోల కొద్ది బంగారం సహా పలు స్థిరాస్తి పత్రాలుండగా, వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ రెడ్డికి చెందిన 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. మహేందర్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి.
