- కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీకి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఫిర్యాదు
వేద న్యూస్, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలో అనధికారికంగా, అక్రమంగా ఎలాంటి అనుమతులు పొందకుండా..పురపాలక సంఘ ఆదాయానికి నష్టం కలిగిస్తూ..ఏర్పడుతున్న లేఅవుట్లను వెంటనే నిలుపుదల చేయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కోరారు.
ఈ మేరకు వారు గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు. అక్రమ లేఅవుట్లు వేస్తోన్న వారిని నిలుపుదల చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ నిలపేయాలని ఫిర్యాదులో స్పష్టం చేశారు.
ఒకవేళ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయితే, అందులోని 10 శాతం భూమని పురపాలక సంఘానికి అప్పగించాలని కోరారు. గత 4 సంవత్సరాల నుంచి అక్రమంగా ఏర్పడిన, ఏర్పడుతోన్న లే అవుట్ల నుంచి కనీసం 1 శాతం ఓపెన్ స్పేస్ కూడా పురపాలక సంఘానికి ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో వాటిపై చర్యలు చేపట్టి..పురపాలక సంఘానికి వావల్సిన ఓపెన్ స్పేస్ ను రాబట్టి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను (అక్రమ అనధికారికమైనవి) తొలగించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీకి అందజేశారు.