• వరంగల్ (తూర్పు) రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ భాషా

వేద న్యూస్, వరంగల్ టౌన్:

ఎన్నికల సంఘం నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు జరిపినట్లు వరంగల్ (తూర్పు) రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయం లోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి అభ్యర్థులకు సింబల్స్ (గుర్తుల) కేటాయింపు జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కేంద్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు షణ్ముగ రాజన్ గుర్తుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి సూచనలు చేస్తూ రాష్ట్రం లో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రత్యేకం గా ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించిందన్నారు.ఎన్నికల సంఘం చే గుర్తింపు పొందని, రిజిస్టర్ అవ్వని, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు తెలుగు అక్షర మాల ప్రామాణికం గా అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగిందని, నామినేషన్ సందర్భం గా అభ్యర్థులు తెలిపిన విధంగా బ్యాలెట్ పై పేరు ను ముద్రించడం జరుగుతుందని, ఇద్దరు అభ్యర్థులు ఒకే గుర్తును ప్రతిపాదిస్తే డ్రా పద్దతిలో సింబల్ కేటాయింపు చేస్తామని, ఎన్నికల సంఘం సూచించిన 193 గుర్తులలో నుండి ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగిందని అన్నారు.

అభ్యర్థుల కు ఎన్నికల ఖర్చులు, ప్రచార వాహనాలకు అనుమతులు, ఇతర అనుమతులు పొందే విధానం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యల గురించి నేడు (గురువారం) సమావేశం నిర్వహించడం జరుగుతుందని,అభ్యర్థులు హాజరు కావాలని ఈ సందర్భం గా ఆర్. ఓ.కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఆర్ ఓ అనిస్ ఉర్ రషీద్, ఏ ఆర్ ఓ లు మహ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు, వివిధ పార్టీల నుండి పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.