• అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితారెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఉన్నంతలో పది మందికి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. శనివారం ఆమె హన్మకొండ బాలసముద్రం లోని ఆనంద నిలయం అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని..వారికి అవసరమై చలిని నివారించే ఉలెన్ క్యాప్స్, అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పిల్లలు అందివచ్చిన అవకాశాలు వినియోగించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చెప్పారు. 

 

పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు. ఆడపిల్లలను భారంగా భావించడం, చెత్త కుప్పలలో పడవేయడం తనకు ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. అనాథ పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు పంచాలని..అది మన మానవత్వానికి నిదర్శనం అని స్పష్టం చేశారు. ఏ అవసరం ఉన్నా తనకు తెలియ చేయవచ్చని తాను చేయగలిగిన సాయం తప్పక చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, వార్డెన్ సుజాత, పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.