- విప్లవ కవిత్వంలో వస్తు రూప వైవిధ్యం పరిశోధనకు..
వేద న్యూస్, మద్దిరాల:
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన శివరాత్రి సుధాకర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన శివరాత్రి సుధాకర్ జర్నలిజంలో ఎం.ఫిల్., ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు సాహిత్యం), ఎం.ఏ. (సమాజ శాస్త్రం) చదివారు. పత్రికారంగంలో జర్నలిస్టుగా పనిచేస్తూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్వహించిన ‘నెట్’ (నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్)లో జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీఎచ్. డీ.లో చేరారు. ‘విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం’ అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన పర్యవేక్షకుడు ప్రొఫెసర్ చింతకింది కాశీం. కాగా, అతని ప్రతిభకు గత ఏడాది సెప్టెంబర్ లో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
అక్టోబర్ 31న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, అడోబ్ సీఈఓ (అమెరికా) శంతను నారాయణ్ శివరాత్రి సుధాకర్ కు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ సూర్యా ధనంజయ్, ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ, ప్రొఫెసర్ వారిజారాణి, డా. రఘు, డా. ఏలె విజయలక్ష్మి, తల్లిదండ్రులు శివరాత్రి లింగమ్మ, మల్లయ్య, పరిశోధక విద్యార్థులు డాక్టర్ శివరాత్రి సుధాకర్ ను అభినందించారు.