= సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
= మడికొండ చౌరస్తా నుంచి అవగాహన ర్యాలీ

వేద న్యూస్, మడికొండ:
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మడికొండ పోలీసుల ఆధ్వర్యంలో టీజీఎన్ఏబీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మడికొండ చౌరస్తా నుంచి ఆర్‌ఎన్‌ఆర్ గార్డెన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్, విద్య, ఆరోగ్య, మహిళా శాఖల అధికారులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ దార కవిత మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, టీజీఎన్ఏబీ, ఈగల్ టీమ్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రగ్స్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేసి గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడికొండ పోలీసులు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు సుమారు 700 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *