కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి

వేద న్యూస్క ,కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గత 5 రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు.రానియ్యలేదన్నారుఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఈరోజు హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేశారన్నారు. ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు. ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే వారిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనుకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ లో ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ‘‘నిన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన ఘటన దారుణం. ఇది పోక్సో కేసు. పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. దీనిని ప్రచారం చేయడంవల్ల వాళ్ల జీవితాలు ప్రమాదంలో పడతాయి. దయచేసి మీడియా సంయమనంతో వ్యవహరించాలి’’అని అభ్యర్ధించారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గత 5 రోజుల నుండి లోతైన విచారణ జరిపించారు. నివేదిక తెప్పించారు. నిందితుడికి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో హెడ్మాస్టర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. వారి పాత్ర ఉంటే వాళ్లపైనా పోక్సో కేసు పెట్టేందుకు వెనుకాడవద్దని అధికారులకు చెప్పాను. పిల్లలకు భరోసా ఇవ్వడంతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన పడకుండా ధైర్యం కల్పించాలని కోరిన. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.’’అని వివరించారు.