వేద న్యూస్, వరంగల్:

నర్సంపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌లకు విద్యార్థుల ఉపకార వేతనాలను చెల్లించాలని వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్‌లను పోలీసులు గురువారం ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత మూడేండ్ల నుంచి విద్యార్థుల ఉపకార వేతనాలు (ఫీజు రీయింబర్స్‌మెంట్)లను ఇవ్వకుండా ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టూడెంట్స్ కు ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని మంత్రులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన మమ్మల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నర్సంపేట పోలీసు స్టేషన్ కు తరలించడం దారుణమన్నారు.

తక్షణమే సమస్యలు పరిష్కరించి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సొంత పూచికత్తుపై బీసీ సంఘం నాయకులను పోలీసులు విడుదల చేశారు.