వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
బీజేపీ నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు(ప్రతాప్), ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివ కోటి యాదవ్ ను కలిశారు. శనివారం శివకోటి యాదవ్ ను నర్సంపేటలోని తన నివాసంలో కలిసి బీజేపీ గెలుపునకు అందరూ సమిష్టిగా కలిసి కృషి చేయాలని బీజేపీ నేతలు కోరారు. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థికి సహకరించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా శివకోటి యాదవ్ వారితో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని, దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడిని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ప్రజాసేవే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చి నియోజవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి జనసైనికులందరి సమిష్టి కృషితో కష్టపడి పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని తెలిపారు. కానీ, నియోజవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందాయని స్పష్టం చేశారు.

పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావడంతో తాను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ భరోసా కోసం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తే ఒక నియోజకవర్గ ఇన్ చార్జిగా, ప్రజానాయకుడిగా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధిష్టానం ఉద్దేశపూర్వకంగా లోపలికి వెళ్లకుండా అడ్డుకుందని ఆరోపించారు. గేటు బయట నిల్చోపెట్టి అవమానించిన ఘటన తనకు అత్యంత బాధను కలిగించిందని స్పష్టం చేశారు. ఈ దుశ్చర్య నియోజవర్గ పార్టీ శ్రేణులు అందర్నీ నిరాశపరిచిందని పేర్కొన్నారు.

తమ నాయకుడికే ఇలా అవమానం జరిగితే..పార్టీలో మా భవిష్యత్తు ఏమిటని ఏ విధంగా ముందుకు వెళ్లాలనే సందిగ్ధ ఆలోచనలో తాను ఉన్నానని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తమకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి..తమ ఆవేదనను అర్థం చేసుకొని పార్టీ భవిష్యత్తు పట్ల ఏదైనా భరోసా కల్పిస్తే గానీ ముందడుగు వేయలేమని చెప్పారు.

ఒకవేళ అలాంటి పరిణామం ఏమైనా జరిగితే..తప్పకుండా బీజేపీ అభ్యర్థి గెలుపునకు నియోజకవర్గ జనసైనికులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని శివకోటి యాదవ్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు వంగ మధు, ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బ పృథ్వీరాజ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బాల్నే జగన్, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.