విశ్వసనీయత, వినూత్న ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుకుంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ ఏడాది థీమ్‌గా ‘నవకల్పనలతో నమ్మక సాధికారత’ నిలిచింది. ఇది బ్యాంకింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు, కస్టమర్ల విశ్వసనీయతను నిలబెట్టుకోవాలనే బ్యాంకు లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎం.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా అనేక వినూత్న కార్యక్రమాలు, డిజిటల్ & టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సుస్థిరాభివృద్ధికి తోడ్పడటం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది.
నూతన ఆవిష్కరణలు, పథకాలు:
బీవోబీ వరల్డ్ బిజినెస్ యాప్ (BoB World Business App): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), వ్యాపారులు, కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇది.
వర్చువల్ ఫ్రంట్ ఆఫీస్ పైలట్ ప్రాజెక్టు (Virtual Front Office Pilot Project): కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కృత్రిమ మేధస్సు (AI), 3డీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించే అధునాతన ప్రాజెక్టు.
బీఓబీ ఇ పే ఇంటర్నేషనల్ (bob e-Pay International): గ్లోబల్ యూపీఐ (UPI) ఫీచర్లను అనుసంధానించిన బీఓబీ ఇ పే యాప్.
బీఓబీ ఇన్సైట్ బ్రెయిలీ డెబిట్ కార్డ్ (bob inSIGHT Braille Debit Card): కంటి సమస్యలు ఉన్న కస్టమర్లకు ఆర్థిక లావాదేవీలలో సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన వినూత్న డెబిట్ కార్డ్.
గ్రీన్ ఫైనాన్సింగ్ స్కీములు (Green Financing Schemes): పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ప్రాజెక్టులకు మద్దతుగా పలు గ్రీన్ ఫైనాన్సింగ్ పథకాలను కూడా ఆవిష్కరించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా..
ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ.. “బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ వ్యవస్థాపక దినోత్సవం, విశ్వసనీయత, దృఢత్వం, నూతన ఆవిష్కరణల పట్ల వారి నిబద్ధతకు నిదర్శనం. వికసిత్ భారత్@2047 లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నప్పుడు, బీవోబీ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు MSMEలకు మద్దతునిస్తూ, యువతకు సాధికారత కల్పిస్తూ, సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందిస్తూ సమ్మిళిత వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని అన్నారు.