• రైతులకు ఇబ్బందులు కలిగేలా చేస్తే సహించేది లేదని వ్యాఖ్య
  • సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తేల్చుకోవాలని డిమాండ్
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్:
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈనెల 31న ముగియనుండడంతో పదవి కాలం పొడుగిస్తారా లేదా ఎన్నికల నిర్వహిస్తారో తేల్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన మండల ప్రజా పరిషత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికా వద్దని, ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి సమస్యలన్నిటినీ పిన్ చేసి తన దృష్టికి తీసుకురావాలన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని రైతులు ఇబ్బంది పడకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు చాలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. రైతులకు ఏదైనా ఇబ్బందులు తలెత్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సర్పంచుల పదవీకాలం ముగియకముందే గ్రామ కార్యాలయాలను ప్రారంభించాలని, ఇన్ చార్జి మంత్రి నిర్ణయం తీసుకొని వెంటనే వాటి ప్రారంభోత్సవానికి అంగీకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 31న సర్పంచుల పదవీకాలం ముగుస్తుందని గ్రామపంచాయతీలో భవనాలు ప్రారంభోత్సవానికి మంత్రి సహకరిస్తే సర్పంచుల కల కూడా నెరవేరుతుందని స్పష్టం చేశారు.

200 యూనిట్లలోపు కరెంటు వాడుకుంటున్న ఎవరైనా సరే బిల్లు కట్టకుండా ఉండాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు మంత్రి కూడా బిల్లు కట్టవద్దని చెప్పిన వీడియో కూడా ఉందని ఎవరైనా విద్యుత్ విభాగం అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఆ వీడియో చూపించాలని అన్నారు.

వినకపోతే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల విషయంలో కూడా అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రాణి సురేందర్, జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణరావు, పిఎస్ సిఎస్ చైర్మన్ సంపత్, నాయకులు ఇంద్రసేనారెడ్డి మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ లతోపాటు వివిధ విభాగాల్లోని అధికారులు పాల్గొన్నారు.
=========