- దాసరి కృషి వల్లే జిల్లాగా పెద్దపల్లి
- ‘ప్రజాఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్
- మనోహర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపు
- సభకు అశేషజనవాహిని హాజరు
వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు:
సీఎం కేసీఆర్ హాజరైన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో జనవాహిని హాజరైంది. అలా పెద్దపల్లి మొత్తంగా గులాబీమయమైంది. గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ కనబడగా, హాజరైన జనాన్ని చూసి శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రజలు సభకు హాజరయ్యారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం సాయం చేసిందని చెప్పారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృషి వల్లనే పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో కొలనూరు, గర్రేపల్లీ, పెద్దపల్లి రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తామని, అగ్రవర్ణాల కులలో పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ‘రైతుబంధు’ వంటి పథకాలను రైతుల కోసం తీసుకొచ్చామని, దానివల్ల రైతులు చాలా లబ్ధి పొందుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సభకు వచ్చిన అశేష జనవాహినికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.