- బహుజనవాదిగా యువనేత ప్రచారం
- ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రయత్నం
- నీలిజెండా ఎగురవేస్తామని పల్లె ప్రశాంత్ ధీమా
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండబోతుందనే ప్రచారం జనబాహుళ్యంలో ఉంది. కాగా, ఈ ఎన్నికల పోరులో నాల్గో అభ్యర్థిగా బీఎస్పీ తరఫున యువనేత పల్లె ప్రశాంత్ కూడా బరిలో ఉన్నారు. నియోజకవర్గ ముఖ చిత్రంలో చతుర్ముఖ పోటీగా మార్చే ప్రయత్నం చేస్తూ..హుజురాబాద్ ప్రజాభిమానం, ఆదరణ చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు గుర్తుకు ఓటేయాలని జనాన్ని అభ్యర్థిస్తున్నారు. నీలిజెండాతో బహుజనులకు న్యాయం జరుగుతుందని ప్రశాంత్ ప్రజలకు వివరిస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన పల్లె ప్రశాంత్ గౌడ్ పట్టభద్రుడు. బహుజనవాదంతో పలు పోరాటాల్లో పాల్గొని..ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ప్రశాంత్ గౌడ్..బీఎస్పీ తరఫున హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పొంది ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చిన్న నాటి నుంచే బహుజన ఎజెండాను మదిలో నింపుకున్న ప్రశాంత్..బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి ఉత్తర తెలంగాణ యువత ఇన్‌చార్జిగా పని చేశారు. యువత అండదండలతో..ప్రజల్లో బహుజనవాదం పట్ల అవగాహన కల్పించి..నీలి జెండా వైపు వారు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు.
ఏనుగు గుర్తుకు జనం ఓటేసేలా ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ గడ్డపై ఇప్పటి వరకు ఎన్నో పార్టీల జెండాలు ఎగిరాయని, ఈ సారి నీలి జెండా ఎగరవేసే దిశగా అడుగులు వేస్తామని బీఎస్పీ శ్రేణులు పేర్కొంటున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మార్గదర్శనంలో హుజురాబాద్ లో తమ సత్తా చాటుతామని బీఎస్పీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చురుకైన యువకుడిగా పల్లె ప్రశాంత్ గౌడ్ ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. చూడాలి మరి..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారో..
ప్రొఫైల్:
పూర్తి పేరు: పల్లె ప్రశాంత్ గౌడ్
పుట్టిన తేదీ: 05-08-1990
తల్లిదండ్రులు: శంకరమ్మ, స్వరూప, బుచ్చిరాజం
స్వగ్రామం: కన్నూర్
ప్రాథమిక విద్యాభ్యాసం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కన్నూర్
ఇంటర్మీడియట్: విస్ డమ్ జూనియర్ కాలేజీ
డిగ్రీ: వాగ్దేవి డిగ్రీ కళాశాల
చేపట్టిన పదవులు: బీసీఆర్‌పీఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి, నియోజకవర్గ అధ్యక్షులు, బీసీఆర్‌పీఎస్ (బీసీ రిజర్వేషన్స్ పోరాట సమితి) ఉత్తర తెలంగాణ ఇన్ చార్జి (యువత)