వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి నియోజవర్గంలో కారు స్పీడు యమజోరుగా సాగుతోంది. ఒక్కసారిగా కారు స్పీడు బాగా పెంచి., పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు బలంగా పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చాలా చురుకుగా ప్రజల్లోకి వెళ్తూ ‘చెల్లెమ్మా, అక్కా, అవ్వ, తమ్ముడు, అన్నా.. బాగున్నావా’ అంటూ ఆత్మీయంగా, ఆప్యాయంగా జనాన్ని పలకరిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.
సర్కార్ సంక్షేమ పథకాలపై ప్రచారం
బీఆర్ఎస్ సర్కార్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చక్కగా వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాల వారీగా పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ ముందడుగు వేయడంలో మనోహర్ రెడ్డికి ‘సాటిలేరు మరెవ్వరు’ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి గులాబీ పార్టీ సర్కార్ రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.