• సామాజిక సేవలోనూ ముందున్న యువనాయకుడు
  • లోక్‌సభ టికెట్ ఆశావాహుల్లో ముందు వరుసలో అభినవ్
  • కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో టచ్..సినీ పెద్దల మద్దతు
  •  కమలం పార్టీ హై కమాండ్ పరిశీలనలో అభినవ్ సర్దార్
  • ఆదిలాబాద్ ఎంపీ బరిలో యువ నేత అభినవ్

వేద న్యూస్, ఆసిఫాబాద్:
‘‘చాయ్ వాలా’’..దేశ రాజకీయాలలో ఈ పదం సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మరో ‘చాయ్ వాలా’ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ‘చాయ్’ వ్యాపారాన్ని ప్రారంభించి అంచంచెలుగా ఎదుగుతూ రాష్ట్రవ్యాప్తంగా చాయ్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన “హైదరాబాది చాయ్ అడ్డా” ఫౌండర్, చైర్మన్ కేతావత్ అభినవ్ సర్దార్ అదిలాబాద్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అధిష్టానం ఆశీస్సులతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

 

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ తన ప్రయత్నాల్లో అభినవ్ తలమునకలవుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీకి పవనాలు వీచినా..ఆదిలాబాద్ జిల్లా లో మాత్రం కమలం పార్టీ మెజారిటీ స్థానాల్లో నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీనే నెలకొని ఉంటుంది. ఈ స్థానం నుంచి కమలం పార్టీ తరఫున బరిలో దిగితే గెలుపు తమదే అని ఇప్పటికే పలువురు ఆశావహులు, బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

మహబూబ్ నగర్ కు చెందిన అభినవ్ సర్దార్ మంగవత్ ప్రస్థానం విషయానికొస్తే..తన పాఠశాల విద్యాభ్యాసాన్ని విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ లో పూర్తి చేశారు. ఎన్ఐటీ వరంగల్ లో ఇంజనీరింగ్, తమిళనాడు లోని ఎన్ఐటీ తిరిచి నుండి ఎంబీఏ కంప్లీట్ చేసి..ఆ తర్వాత కోకకోలా సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ గా స్థిరపడ్డారు.

2006 లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీవేణి ను వివాహం చేసుకున్నారు. 15 సంవత్సరాల పాటు వివిధ సంస్థలలో వివిధ హోదాలలో పనిచేసిన సర్దార్ టీ వ్యాపారానికి సంబంధించి వినూత్న ఆలోచనతో 2015 లో ‘హైదరాబాది చాయ్ అడ్డా’ పేరుతో కేఫే ను ప్రారంభించారు. అనతి కాలంలోనే హైదరాబాద్ నగరంలో ‘హైదరాబాది చాయ్ అడ్డా’ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించారు అభినవ్ సర్దార్. ఇదే కాకుండా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వంటి అనేక వ్యాపార రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్నారు అభినవ్ సర్దార్.

వ్యాపార రంగంతో పాటు సినీ రంగంలోనూ అభినవ్ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. సినీ నటుడిగా ‘తేజం’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అభినవ్..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ పలు చిత్రాలకు వ్యవహరించారు. కడు పేదరికంలో జన్మించిన అభినవ్ సర్దార్ కష్టపడి తన జీవిత ఆశయాలను పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

సామాజిక సేవలోనూ ముందున్న ఈ సినీ నటుడు..అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సమాజానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నారు. నిస్వార్థంగా పని చేసే ఎన్విరాన్ మెంట్ బీజేపీలో ఉంటుందని భావించి.. ఈ ఏడాది జనవరిలో బీజేపీలో చేరిన అభినవ్..కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీలో ముందుకు సాగుతున్నారు. తన అత్తగారి ఊరున్న జిల్లాను తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఇప్పటికీ కనీస అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అని తాను గుర్తించానని, అందుకే అదిలాబాద్ జిల్లాలోనే న్యాయంగా పని చేసి అభివృద్ధి చేసే అవకాశం ఉందని భావించానని అభినవ్ వెల్లడించారు. బీజేపీ అధిష్టానం అవకాశమిస్తే ..తాను అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.

ఎంపీ టికెట్‌కు సంబంధం లేకుండా బీజేపీలో జెండా మోస్తు కష్టపడతానని, ఏది ఏమైనప్పటికీ అదిలాబాద్ జిల్లాను సైతం విడవబోనని అభినవ్ సర్దార్ ప్రకటించడం విశేషం. ఇప్పటి వరకు తాను అనుకున్న ఆశయాలు వేటిని మధ్యంతరంగా విడిచిపెట్టలేదని, అదే విధంగా అదిలాబాద్ జిల్లాలో తాను చేయాలనుకున్న సమాజసేవ, అభివృద్ధి ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టేది లేదని అభినవ్ సర్దార్ వెల్లడించారు. ఎంపీ టికెట్ వచ్చినా, రాకపోయినా ఆదిలాబాద్ జిల్లాను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.