• కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక అర్హులకే సంక్షేమ పథకాలు
  • ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు    

వేద న్యూస్, వరంగల్:
గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కాశిబుగ్గకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భూక్య చందూలాల్ నాయక్ శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చందూలాల్ నాయక్ కు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ అవినీతి, అన్యాయాలను సహించలేక చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చందూలాల్ బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు, దళిత బంధు, గృహలక్ష్మి తదితర పథకాలను అందించకుండా, అనర్హులైనా కూడా వారి అనుచరులకు మాత్రమే లబ్ధిదారులు గా గుర్తిస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీలో చేరుతున్నట్లు చందూలాల్ నాయక్ వెల్లడించారు. సీనియర్ నాయకులకు సైతం బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపించారు.