- ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను కలిసిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్
వేద న్యూస్, హైదరాబాద్:
ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భాగంగా (అండర్-21 విభాగం) ఫైనల్ మ్యాచ్ లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్ పై గెలుపొంది వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి భారతదేశ ఖ్యాతిని చాటుతూ తెలంగాణ కీర్తి పతాకం ఎగరేసిన పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత ఆదివారం బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గత నెల ఆగస్టు నెలలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో చికిత ప్రదర్శించిన ప్రతిభను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కు వివరించారు. ఆర్చరీ పోటీల్లో చిఖిత అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన విశ్వాసంతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచి దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ఆయన ప్రశంసించారు.
‘‘చికిత సాధించిన ఈ విజయం మహిళల ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలకు నిదర్శనం. ఈ విజయం కేవలం చికిత ఒక్కరిదే కాదు, ఇది దేశం గర్వించదగ్గ విషయం అని కొనియాడుతూ..’’ చికితకు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లక్ష రూపాయలను ఆర్థికసాయం అందించి.. శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆడబిడ్డను క్రీడల్లో రాణించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ చికితలోని ప్రతిభను వెలికితీయడానికి తోడ్పడిన ఆమె తల్లిదండ్రులను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అభినందించారు.
